
మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్
బీఆర్‌ఎస్‌లోకి మెదక్ నియోజకవర్గ హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు
ఫుల్ జోష్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి
బీఆర్ఎస్ పార్టీలో చేరిన మైనంపల్లి అనుచరులు
కేటీఆర్, హరీష్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. మెదక్ నియోజకవర్గంలో గత ఎన్నికలకు ముందు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలంతా తిరిగి గులాబీ గూటికి చేరారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు సమక్షంలో మైనంపల్లి అనుచరులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలంతా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలోనే మెదక్ అభివృద్ధి చెందిందన్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. ఘనపురం ఆయకట్టుకు నీరిచ్చిన ఘనత గత కేసీఆర్ సర్కార్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా వచ్చేది మళ్లీ కేసీఆర్ సర్కారే అని అంటున్నారని తెలిపారు హరీశ్.
పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు. కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేతలే తిరిగబడే రోజులు వస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పద్మాదేవేందర్‌రెడ్డి. మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో పద్మాదేవేందర్‌రెడ్డి ఫుల్ జోష్‌లో ఉన్నారు.