
BIG NEWS: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మికత, నిష్ఠ, భక్తి భావనలతో నిండిన ఈ క్షేత్రంలో ప్రతి అణువులోనూ స్వామివారి సాన్నిధ్యం ఉందని భక్తుల గాఢ విశ్వాసం. అలాంటి పవిత్ర ప్రాంతంలో భద్రతకు, పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది.
ఈ నిబంధనల్లో భాగంగా తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు, ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు ప్రదర్శించడం పూర్తిగా నిషేధం. అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో రీల్స్ చేయడం, వీడియోలు చిత్రీకరించడం కూడా ఖచ్చితంగా అనుమతించబడదు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ఈ ఆంక్షలను లెక్కచేయకుండా వింత పోకడలకు పాల్పడుతూ స్వామివారి పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తిరుమలలో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు శ్రీవారి ఆలయం ఎదుట అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ బ్యానర్‌ను విడుదల చేసి, అందులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళనిస్వామి ఫోటోలు ఉంచారు. ఈ ఫ్లెక్సీని ఆలయం ముందు ప్రదర్శించడమే కాకుండా, వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియోలు వైరల్ కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో రాజకీయ ఫ్లెక్సీలు ఎలా అనుమతించారన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలిపిరి చెక్‌పోస్ట్‌లో కఠిన తనిఖీలు ఉన్నప్పటికీ, ఆ ఫ్లెక్సీ తిరుమల వరకు ఎలా చేరిందన్నది చర్చనీయాంశంగా మారింది. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపడంతో టీటీడీ కూడా స్పందించింది. శ్రీవారి ఆలయం ముందు జరిగిన ఈ ఘటనపై టీటీడీ సీపీఆర్వో కీలక ప్రకటన విడుదల చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించడం, రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర నేరమని స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయం, మాడ వీధులు, పరిసర ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు, వ్యాఖ్యలు, ఫ్లెక్సీలు పూర్తిగా నిషేధించబడ్డాయని టీటీడీ పేర్కొంది. అలాగే రీల్స్, వీడియో షూటింగ్‌లపై కూడా సంపూర్ణ నిషేధం అమలులో ఉంది. గతంలోనూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసిన ఉదాహరణలు ఉన్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ఒడిశాకు చెందిన కొందరు యువకులు తిరుమల కొండలపై ప్రమాదకరంగా శిలలపైకి ఎక్కి రీల్స్ చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బృందాలు వారిని అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టాయి. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే వారికి ఎలాంటి ఉపేక్ష ఉండదని అప్పట్లో టీటీడీ హెచ్చరించింది.
తాజా తమిళనాడు యువకుల ఘటన నేపథ్యంలో మరోసారి అదే హెచ్చరికను టీటీడీ పునరుద్ఘాటించింది. తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా భద్రతా నిబంధనలు అమలు చేస్తున్నామని, వాటిని అతిక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదానిపై భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది.
ALSO READ: Horoscope: నేడు వీరికి అనేక లాభాలు





