
Harsh Goenka: జీఎస్టీ విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ జీఎస్టీలో కీలక సంస్కరణలు చేపట్టిందంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు రాజకీయ, వ్యాపార వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ దివాళీ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా దిగ్గజ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రకటించిన దీపావళి కానుక అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. “ప్రతి భారతీయుడికి ఇది అతిపెద్ద దీపావళి కానుక. రోజూవారీ నిత్యావసరాలు, వైద్యం, విద్య, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించారు. ఇప్పుడు కిరాణ సామగ్రి చౌక ధరకే లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చు తగ్గుతుంది. విద్య అందుబాటు ధరలో ఉంటుంది. రైతులకు మద్దతు దొరుకుతుంది. మొత్తంగా నెక్ట్ జీఎస్టీ=జీవన సౌలభ్యం+ఆర్థిక వ్యవస్థకు ఊతం” అని హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
జీఎస్టీ విధానంలో కీలక మార్పులు
తాజాగా జీఎస్టీ విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న 5, 12, 18, 28 శాతం స్లాబుల్లో 12, 28 శాతం స్లాబులను తీసేశారు. ఈ క్రమంలోనే 12 శాతం జీఎస్టీని ఎదుర్కొంటున్న 99 శాతం వస్తూత్పత్తులను 5 శాతంలోకి, 28 శాతం పన్ను పడుతున్న వాటిలో 90 శాతం వస్తూత్పత్తులను 18 శాతంలోకి తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ప్రత్యేకంగా 40 శాతం స్లాబును ఏర్పాటు చేయగా, ఇందులో 6-7 వస్తూత్పత్తులే ఉంటున్నాయి. వీటిలో పొగాకు, పాన్ మసాలా, లగ్జరీ బైకులు, కార్లు మొదలైన వాటిని ఉంచుతున్నారు. ఈ నెల 22 నుంచి మారిన స్లాబుల ప్రకారం ఆయా వస్తూత్పత్తులపై నూతన పన్ను రేట్లు వర్తించనున్నాయి.