
BIG BREAKING: రేషన్ కార్డుదారులకు సంబంధించి పౌరసరఫరాల శాఖ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తికాని యూనిట్లకు రేషన్ కోటాను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో రేషన్ కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది.
రేషన్ తీసుకునే ప్రతి సభ్యుడు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ పూర్తయ్యే వరకు రేషన్ అందించేది లేదని స్పష్టంగా తెలియజేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ ఎందుకు పూర్తికాలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మేడ్చల్ జిల్లా పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 76 శాతం మందే ఈ కేవైసీ పూర్తి చేశారని అధికారులు వెల్లడించారు. మిగిలిన 24 శాతం మంది ఈ నెల 20వ తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేయకపోతే వారికి రేషన్ కోటా ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో లబ్ధిదారులు రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో మొత్తం 6 లక్షల 31 వేల 33 రేషన్ కార్డులు ఉండగా, వాటికి సంబంధించి 20 లక్షల 77 వేల 72 మంది సభ్యులు ఉన్నారు. గతంలో ఉన్న కార్డుదారులతో పాటు ఇటీవల మంజూరైన కొత్త రేషన్ కార్డుల సభ్యులు కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే కొందరి బయోమెట్రిక్ వేలిముద్రలు ఈ పాస్ యంత్రంలో నమోదు కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. యంత్రంలో నమోదు కాకపోతే తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
గడువు దగ్గర పడుతుండటంతో రేషన్ కార్డుదారులు గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వేలిముద్రలు సరిగా పడకపోవడం, వృద్ధులు, కూలీలు, దూర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గడువు పొడిగించాలని కోరుతున్నారు. లేదంటే అనేక మంది పేదలు రేషన్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కొత్తగా మంజూరైన రేషన్ కార్డుదారులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఉచిత వంటగ్యాస్, గృహజ్యోతి, ఉచిత కరెంట్ వంటి పథకాలు అమలవుతుండగా, కొత్త కార్డుదారులు ఈ ప్రయోజనాలకు దూరంగా ఉన్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. సన్నబియ్యం తప్ప ఇతర పథకాలు తమకు అందడం లేదని వాపోతున్నారు.
కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే వాటి ఉపయోగం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. కొత్త కార్డుదారులకు కూడా అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కేవైసీ ప్రక్రియ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: IDPL: కవిత vs బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ప్రభుత్వం కీలక నిర్ణయం





