ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్,క్రైమ్ మిర్రర్:- ప్రభుత్వ అధికారులు తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో హైదరాబాద్ మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ (ఎంహెచ్ఆర్డీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, స్టడీ టూర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన గ్రూప్–I అధికారుల కోసం ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాపాలనలో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ విధానాల అమలుపై ప్రాయోగిక అవగాహన కల్పించడమే ఈ శిక్షణా కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శిక్షణను అధికారులు సద్వినియోగం చేసుకొని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక దేవాలయాలు, ప్రకృతి సౌందర్య ప్రదేశాలు, వన్యప్రాణులు, వివిధ రకాల పక్షులు, జంతువులతో పాటు అక్కడ నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం, నైపుణ్యాలు, సామాజిక–ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని శిక్షణ పొందుతున్న అధికారులకు కలెక్టర్ సూచించారు.

స్టడీ టూర్‌లో భాగంగా తొలి రోజు నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం, అక్కమహాదేవి ఆలయాలను సందర్శించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సందర్శన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉంటారని, సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
నల్లమల అందాలను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ప్రకృతి అనుభూతిని పొందాలని, దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన అమ్రాబాద్ నల్లమల పెద్దపులుల అభయారణ్యం లోని దట్టమైన అడవులను సందర్శించి అధ్యయనం చేయాలని కలెక్టర్ కోరారు. నల్లమల అటవీ ప్రాంతం జలపాతాలు, గుహలు, దట్టమైన వృక్షజాలం, సమృద్ధమైన జంతుజాలంతో ప్రకృతి అందాలకు నిలయంగా ఉందని తెలిపారు.
చరిత్రను ప్రతిబింబించే శాసనాలు, ప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేసే వాగులు–వంకలు,కృష్ణా తీరం వెంబడి ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు, దట్టమైన అడవుల్లో వన్యప్రాణుల సందళ్లు కలసి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని, ఈ అధ్యయన పర్యటన ద్వారా అనేక అనుభూతులను అందిపుచ్చుకొని శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, డా. డి. తిరువెంగళ చారి, కోర్స్ కోఆర్డినేటర్,కంబైన్డ్ ఫౌండేషన్ కోర్స్ , గ్రూప్ -I సర్వీస్ అధికారులు 2026 (బ్యాచ్–I) తదితరులు పాల్గొన్నారు.

సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం

కెసి తండా చెరువులో ఇద్దరు చిన్నారులు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button