హాలీవుడ్ సినిమాల్లో కళ్లు మూసి తెరిచేలోగా భారీ దోపిడీలు జరగడం చూస్తుంటాం. ఎంతో చాక చక్యంగా నగలు, నగదును కొట్టేయడం గమనిస్తాం. అచ్చం అలాంటి సీనే కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగింది. పట్టపగలే దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. డైరీ సర్కిల్ దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని మోసగించి ఏటీఎంకు నగదు తరలించే వాహనంతో ఉడాయించారు. ఆ వాహనంలో ఏకంగా రూ.7.11 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
బెంగళూరులోని ఓ ఏటీఎం మెషీన్‌లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు, సెక్యూరిటీ వాహనంలో డబ్బులతో సిబ్బంది బయల్దేరారు. డైరీ సర్కిల్ దగ్గరికి చేరుకోగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉన్న ఓ ఇన్నోవాలో కొంత మంది దుండగులు వచ్చారు. డబ్బులు తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డగించారు. తాము ఆర్‌బీఐ అధికారులమని చెప్పారు. సెక్యూరిటీ వాహనంలో తీసుకెళ్తున్న డబ్బును చెక్ చేయాలంటే మాటల్లో పెట్టారు. ఏటీఎంలో డబ్బులు పెట్టే సిబ్బంది అయోమయంలో ఉండగానే, డబ్బుతో ఉన్న వాహనాన్ని తీసుకుని పారిపోయారు. ఒక్కసారిగా మోసపోయామని గుర్తించిన సిబ్బంది పోలీసులకు, బ్యాంకు సమాచారం అందించారు.
ప్రత్యేక బృందంతో పోలీసుల గాలింపు
ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. చోరీకి గురైన సమయంలో వాహనంలో రూ.7.11 కోట్ల క్యాష్ ఉందని సదరు సిబ్బంది వెల్లడించారు. ప్రత్యేక బృందంతో దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని వెల్లడించారు.





