తెలంగాణ

హైదరాబాద్‌లో కుండపోత, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: హైదరాబాద్ కుండపోత వర్షంతో నీటమునిగింది. నరంగలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం స్థంభించిందిజ నగరంలో రోడ్లలన్నీ జలమయం అయ్యాయి.   పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలని సీఎం రేవంత్‌ సూచించారు. ట్రాఫిక్‌, విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. వాటర్‌ లాగింగ్‌ పాయింట్స్‌ దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడా నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉన్నతాధికారులతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్ లో భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎస్‌ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  250 బృందాలు పనిచేస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ, కలెక్టర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు పనిచేస్తున్నాయని సీఎస్‌కు అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీఎస్‌ ఆదేశించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా నీళ్లు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. డ్రైనేజీల మూతలు ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించవద్దని ప్రజలకు సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.

సహాయక చర్యల్లో హైడ్రా..

భారీ వర్షం నేపథ్యంలో హైడ్రా సహాయ చర్యలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా షేక్‌పేట, ఉస్మానియా, గచ్చిబౌలి, కొండాపూర్, కృష్ణానగర్‌లో హైడ్రా కమిషనర్‌ రంగరాథ్‌ పర్యటించారు. రహదారులపై పడిన చెట్లను అధికారులు తొలగించారు. రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీటిని కాల్వలకు మళ్లించారు.

Read Also: హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు, వాహనదారుల నరకయాతన!

Back to top button