BC Reservations Protest: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పించేవరకు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
29న రహదారుల దిగ్బంధం, 30న ఛలో హైదరాబాద్
బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడతామని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు బలమైన ఉద్యమం చేస్తామన్నారు. ఇందులో భాగంగా 29న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం చేయనున్నట్లు ప్రకటించారు. జీవో 46కు వ్యతిరేకంగా విద్యానగర్ బీసీ భవన్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణయ్య ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ నెల 30న ఛలో హైదరాబాద్, బీసీల ధర్మయుద్ధ భేరి సభలను నిర్వహిస్తామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ ప్రకటించారు. వేలాది మందితో సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గర బీసీ సంఘాల రాస్తారోకో
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించే వరకు విశ్రాంతి తీసుకోబోమన్నారు మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి. కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని సినీ నటుడు నారాయణమూర్తి అన్నారు. జీవో 46ను వెంటనే రద్దు చేసి, సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ బీసీ సంఘాల నాయకులు లోయర్ ట్యాంక్‌బండ్ లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర రాస్తారోకో నిర్వహించారు. అరగంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.





