జాతీయం

Ballari Clash: బళ్లారి కాల్పుల ఘటన.. 11 మంది కాంగ్రెస్, బీజేపీ నేతలపై కేసులు!

బళ్లారిలో గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పులు, ఘర్షణకు సంబంధించి పోలీస్ యాక్షన్ మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు.

బళ్లారిలో తాజాగా మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పులు, ఘర్షణకు సంబంధించి పోలీస్ యాక్షన్ షురూ అయ్యింది. రెండు వర్గాలపైనా కేసులు నమోదయ్యాయి. హవ్వంబావిలోని జనార్దన్‌రెడ్డి ఇంటి దగ్గర జరిగిన దాడులు, కాల్పుల ఘటనలో కాంగ్రెస్‌, బీజేపీకి చెందినవారిపై కేసు నమోదు చేశామని కర్ణాటక ఏడీజీపీ హితేంద్ర తెలిపారు. గాలి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి బి.శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌ మోత్కర్‌, ప్రకాశ్‌రెడ్డి, పాలన్న, దివాకర్‌, మారుతీ ప్రసాద్‌, దమ్మూరు శేఖర్‌, అలీఖాన్‌ సహా 11 మందిని నిందితులుగా చేర్చామన్నారు.

బళ్లారిలో బందోబస్తు ఏర్పాటు

అటు బళ్లారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి అనుచరులు హనుమంత, సతీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌, చానల్‌ శేఖర్‌పైనా కేసు నమోదు చేశామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, మహర్షి వాల్మీకిని అవమానించడంపైనా కేసు పెట్టామన్నారు. ప్రైవేటు గన్‌మెన్‌ నుంచి ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని, కాల్పుల్లో మరణించిన రాజశేఖర్‌ మృతదేహంలో దొరికిన బుల్లెట్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. బళ్లారిలో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

మధ్యాహ్నం బాధ్యతలు.. తెల్లారే సస్పెన్షన్‌

బళ్లారి ఘర్షణ, కాల్పులకు సంబంధించి జిల్లా ఎస్పీ పవన్‌ నిజ్దూర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి పవన్‌ గురువారం మధ్యాహ్నమే బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని గంటలకే సస్పెండవడం గమనార్హం.

 గాలి జనార్థన్ ఏమన్నారంటే?

రాజశేఖర్‌ మరణానికి పోలీసు తుపాకీ కారణం కాదని, ప్రైవేటు గన్‌మెన్‌ తుపాకీ నుంచి వచ్చిన తూటాలే కారణమని గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. అది ఎవరి తుపాకీనో పోలీసులు నిర్ధారిస్తారని ఆయన వెల్లడించారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కర్ణాటకలో రచ్చ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button