చెన్నూర్,క్రైమ్ మిర్రర్:- క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఓటమి ఫ్రస్ట్రేషన్‌లో రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం చెన్నూర్ క్యాంప్ కార్యాలయంలో ఎంపీ వంశీకృష్ణతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎక్స్-అఫీషియో సభ్యులుగా తాను, ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యేందుకు వెళ్తుండగా బాల్క సుమన్ వర్గీయులు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించారని ఆరోపించారు. తాను, తన కుమారుడు ప్రయాణిస్తున్న కారును బ్యారికేడ్లతో అడ్డుకుని రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్త గాయపడ్డారని చెప్పారు. దాడి దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం కూనీ అవుతోందన్న బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. అసలైన ప్రజాస్వామ్య విధ్వంసం గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోనే జరిగిందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం, డబ్బులు వెదజల్లి ఏకగ్రీవాలు చేసుకోవడం బీఆర్‌ఎస్‌కు అలవాటైందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, అప్పట్లో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర ఏళ్లలో అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని, ఒక్క బీఆర్‌ఎస్ నాయకుడినీ అకారణంగా వేధించలేదని మంత్రి స్పష్టం చేశారు. క్యాతనపల్లిలో విపక్షాలు కొన్ని సీట్లు గెలుచుకోవడం ప్రస్తుత ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగినట్లు సూచిస్తోందన్నారు. దాడి ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. రాజకీయాల్లో రౌడీయిజానికి స్థానం లేదని, బాల్క సుమన్ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
