దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయని రేవంత్ టీం చెబుతున్న లెక్కలపై విమర్శలు వస్తున్నాయి. తూతూమంత్రంగా ఒప్పందాలు చేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాగ్ కంపెనీలతో దావోస్ లో ఒప్పందాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ మాజీ నేత దావోస్ పెట్టుబడులపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి దావోస్‌కి పోయి తెచ్చిన పెట్టుబడులు ఐదు సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేస్తామని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వాలని కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. రూ.10 కోట్లు పెట్టి దావోస్ పోయి అక్కడ నుండి రూ. లక్ష 70 వేల కోట్లు సూట్ కేసులో పట్టుకొని వస్తున్నాం.. మాకు స్వాగతం పలకండని మళ్లీ రూ.20 వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు.
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాలలో ఈ రూ.లక్ష 70 వేల కోట్లు పెట్టుబడులు తెస్తామని తాను ఇచ్చిన ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలని రేవంత్ రెడ్డికి బక్కా జడ్సన్ సవాల్ చేశారు. మొత్తం తెచ్చామని చెప్పుకుంటున్న 64 కంపెనీలు ఈ నాలుగు సంవత్సరాలలో పెట్టకుంటే మమ్మల్ని జైలులో పెట్టమని బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి సంతకం పెట్టాలని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయట్లేదని ఈ బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ సెక్రటరీ, ఐటీ మంత్రి అడ్వైజర్ సంతకాలు పెట్టాలని బక్క జడ్సన్ డిమాండ్ చేశారు.