హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో పరిచయం పెంచుకున్న యువకుడు, ఆమెను మోసం చేసి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అంతటితో ఆగకుండా తన స్నేహితుడితోనూ ఆమెపై దురాగతానికి ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిరంతర వేధింపులు, బెదిరింపులతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబసభ్యులు అప్రమత్తమై ప్రాణాలు కాపాడినట్లు తెలిసింది. అనంతరం ఈ ఘటన మొత్తం బయటపడింది.
బాచుపల్లి పోలీసుల సమాచారం, బాధితురాలి తల్లి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన 20 ఏళ్ల యువతి సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో మరో విభాగంలో చదువుతున్న 20 ఏళ్ల యువకుడు ఆమెకు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. పరిచయం అయిన వారం రోజుల్లోనే ప్రేమ పేరుతో ప్రపోజ్ చేసినట్లు యువతి తెలిపింది. ఆ తరువాత స్నేహం పేరుతో దగ్గరై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2023 అక్టోబర్‌లో కళాశాల ఆవరణలోని ఒక గదిలో ఆమెపై బలవంతంగా అఘాయిత్యం చేశాడని పేర్కొంది. ఆ సమయంలో కళాశాల సిబ్బంది యువకుడిని పట్టుకున్నప్పటికీ, కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత బెదిరింపులు కొనసాగిస్తూ పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆమె వివరించింది. చాక్లెట్లలో మత్తు పదార్థం కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి, అసభ్య దృశ్యాలు చిత్రీకరించి వాటిని బయటకు విడుదల చేస్తానని బెదిరించినట్లు పేర్కొంది.
గత ఏడాది ఫిబ్రవరి 14న తన మిత్రుడిని ఆమెకు పరిచయం చేసి సమస్య పరిష్కరిస్తానని నమ్మబలికి మరో హోటల్‌కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కూడా ఆమెపై దురాగతానికి ప్రయత్నించగా, యువతి తప్పించుకొని బయటపడినట్లు సమాచారం. అయినప్పటికీ వీడియోలు, ఫోటోలు బయటకు రాకుండా ఉండాలంటే తన మాట వినాలంటూ బెదిరింపులు కొనసాగించాడని బాధితురాలు తెలిపింది. ఈ వేధింపుల మధ్య ఆమె గర్భం దాల్చినట్లు, విషయం చెప్పగా గర్భనిరోధక మాత్రలు ఇచ్చి సమస్యను దాచిపెట్టే ప్రయత్నం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. మందులు వాడడంతో ఆరోగ్యం క్షీణించి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కుటుంబ సభ్యులు సమయానికి స్పందించి ఆమెను రక్షించారు. అనంతరం తల్లి నిలదీయగా తనపై జరిగిన అన్యాయం గురించి యువతి వెల్లడించింది. దీంతో ఫిబ్రవరి 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తెపై ఇంతటి దారుణం జరుగుతుంటే కళాశాల యాజమాన్యం ఎందుకు స్పందించలేదని బాధితురాలి తల్లి ప్రశ్నిస్తోంది. అమ్మాయిల భద్రతపై విద్యాసంస్థలు మరింత బాధ్యత తీసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని కోణాల్లో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీస్తామని అధికారులు తెలిపారు.
ALSO READ: US-Iran War: ఇరాన్‌తో యుద్ధం చేయడానికి అమెరికా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
