పూర్వ కాలంలో మన పెద్దలు అన్నం వడకట్టిన గంజిని అమృతంలా భావించి తాగడం ఒక సాధారణ ఆచారం. అయితే నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది ఈ గంజిని పనికిరాని నీటిగా భావించి పారబోస్తున్నారు. కానీ నిజానికి అన్నం ఉడికిన తర్వాత వచ్చే ఈ తెల్లటి గంజి నీటిలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు దాగి ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ వంటి పదార్థాలు సమృద్ధిగా ఉండే ఈ గంజి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా వంటల్లో సహజమైన రుచిని, ఆకృతిని పెంచే అద్భుతమైన పదార్థంగా పనిచేస్తుంది. సరైన విధంగా ఉపయోగిస్తే ఇది మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు గంజి నీటి వినియోగంపై అవగాహన పెరుగుతోంది.
అన్నం ఉడికిన నీటిలో తక్షణ శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది వంటల్లో సహజంగా చిక్కదనాన్ని పెంచే లక్షణం కలిగి ఉంటుంది. అందువల్ల సూపులు లేదా కూరలు పల్చగా ఉన్నప్పుడు సాధారణ నీటికి బదులుగా గంజి నీటిని ఉపయోగిస్తే, వాటికి సహజమైన చిక్కదనం, మృదువైన ఆకృతి వస్తుంది. ప్రత్యేకంగా వెజిటబుల్ సూప్ లేదా చికెన్ సూప్‌లలో దీనిని ఉపయోగిస్తే క్రీమీగా మారి రుచిని మరింతగా పెంచుతుంది. అలాగే కూరల్లో కార్న్ ఫ్లోర్ వంటి పదార్థాలు వాడకుండా గంజి నీటిని కలిపితే సహజ రుచి నిలిచి ఉంటుంది.
చపాతీలు లేదా పూరీలు తయారు చేసే సమయంలో పిండి కలుపుతుంటే, మామూలు నీటికి బదులుగా గోరువెచ్చని గంజి నీటిని ఉపయోగించడం వల్ల పిండి మరింత మెత్తగా మారుతుంది. దీనివల్ల తయారయ్యే చపాతీలు ఎక్కువ సేపు మృదువుగా ఉండి తినడానికి సులభంగా ఉంటాయి. ఇదే విధంగా ఇడ్లీ, దోసె పిండిలో కొద్దిగా గంజి నీటిని కలిపితే పులియే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. దీని ఫలితంగా ఇడ్లీలు మెత్తగా, దోసెలు కరకరలాడేలా తయారవుతాయి.
చట్నీలు తయారు చేసే సమయంలో కూడా గంజి నీరు ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి లేదా పల్లీ చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు దీనిని కలిపితే చట్నీ మరింత మెత్తగా, రుచిగా తయారవుతుంది. ఉదయం పూట ఓట్స్ లేదా దలియా వండేటప్పుడు గంజి నీటిని ఉపయోగిస్తే అవి క్రీమీగా మారి తినడానికి మరింత రుచిగా ఉంటాయి. ఈ విధంగా వాడటం వల్ల జీర్ణక్రియకు కూడా మేలు జరుగుతుంది.
అనారోగ్య సమయంలో గంజి నీరు శరీరానికి సహజమైన శక్తి పానీయంగా పనిచేస్తుంది. కొద్దిగా ఉప్పు, వాము లేదా జీలకర్ర పొడి కలిపి తాగితే ఇది కడుపుకు తేలికగా ఉండి, శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. అలాగే కూరగాయలు ఉడికించేటప్పుడు కూడా ఈ నీటిని వాడటం వల్ల అందులోని పోషకాలు వృథా కాకుండా మనకు లభిస్తాయి.
ఇలా చూస్తే గంజి నీరు అనేది పారబోయాల్సిన వ్యర్థం కాదు, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచే సహజ సంపద. చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా వంటల్లో రుచిని పెంచుకోవడమే కాకుండా, పోషకాలను కూడా కాపాడుకోవచ్చు. దీంతో ఆహార పదార్థాల వృథాను తగ్గిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు.
