
చలికాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు గజగజ వణుకుతుంటారు. ఈ సమయంలో నీళ్లు మరింత చల్లగా మారుతాయి. ముఖ్యంగా ఉదయం స్నానం చేయాలంటే నీటిని తాకడానికే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. చేతులు వణికిపోవడం, శరీరం చల్లబడిపోవడం సాధారణంగా కనిపిస్తాయి. అందుకే చలికాలంలో చాలామంది సహజంగానే వేడి నీటితో స్నానం చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే కొంతమంది మాత్రం చలిని లెక్కచేయకుండా చల్లటి నీటితోనే స్నానం చేస్తూ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని భావిస్తుంటారు.
గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి వేడి నీరు మంచి ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో కండరాలు గట్టిపడి నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో గోరువెచ్చని నీరు రక్త ప్రసరణను మెరుగుపరచి నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజువారీ జీవితంలో పెరుగుతున్న పని ఒత్తిడి, మానసిక ఉద్రిక్తతల కారణంగా శరీరం, మనసు రెండూ అలసిపోతాయి. అలాంటి వేళ వేడి నీటితో స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి శరీరం రిలాక్స్ అవుతుంది.
వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని రంధ్రాలు తెరుచుకుంటాయి. దీని వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, ధూళి సులభంగా తొలగిపోతాయి. శరీరం పూర్తిగా శుభ్రపడటంతో బ్యాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది. చలికాలంలో చర్మం పొడిబారిపోవడం సాధారణం. అలాంటి పరిస్థితుల్లో గోరువెచ్చని నీరు చర్మానికి తేమను కాపాడుతూ సహజ నూనెలను నిలబెట్టేలా చేస్తుంది. చాలా చల్లని నీరు లేదా అతిగా వేడి నీరు వాడకుండా గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో స్నానం చేయడానికి గోరువెచ్చని నీరే అత్యుత్తమం. ఇది చలిదనాన్ని తగ్గించడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. చర్మానికి ఎలాంటి హాని కలగకుండా సహజ రక్షణను అందిస్తుంది. రోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి తగిన శక్తి లభించి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది.
అయితే అతిగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా వేడి నీరు తల చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. దీని కారణంగా చుండ్రు సమస్య పెరగడం, జుట్టు రాలడం, తలపై దురద వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొందరిలో అతిగా వేడి నీటితో స్నానం చేసిన తర్వాత తలనొప్పి పెరిగినట్లు అనిపించవచ్చు. అలాగే రక్తపోటు సమస్య ఉన్నవారిలో తాత్కాలికంగా బీపీ తగ్గిపోయిన భావన కలగవచ్చు.
ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వేడి నీళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా వేడి నీరు రక్తనాళాలను అకస్మాత్తుగా విస్తరింపజేస్తుంది. దీని వల్ల గుండెపై అదనపు భారం పడుతుంది. శరీరం అధికంగా శ్రమించాల్సి రావడంతో గుండె స్పందన పెరుగుతుంది. దీర్ఘకాలంగా గుండె సమస్యలు ఉన్నవారిలో ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల గుండె జబ్బులు ఉన్నవారు తప్పనిసరిగా అతి వేడి నీటిని నివారించి గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
ఇక ఫిట్స్ సమస్య ఉన్నవారు కూడా చాలా చల్లని నీరు లేదా అతిగా వేడి నీటితో స్నానం చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా ఉష్ణోగ్రత మార్పు వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి చలికాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గోరువెచ్చని నీటిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: కొత్త పథకం.. రూ.10 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం





