జాతీయం

రోడ్డుపై వెళ్లేప్పుడు కుక్కలు వెంటపడుతున్నాయా? టెన్షన్ పడకుండా ఇలా తప్పించుకోండి!

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్య తీవ్రమైన రూపం దాల్చుతోంది. ముఖ్యంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా వీధికుక్కల గుంపులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్య తీవ్రమైన రూపం దాల్చుతోంది. ముఖ్యంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా వీధికుక్కల గుంపులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రివేళ మాత్రమే కాదు, పగలు కూడా కంటపడితే చాలు దాడికి దిగుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఒంటరిగా నడిచే వ్యక్తులు వీటి దాడులకు ఎక్కువగా బలవుతున్నారు. చిన్న పిల్లులు, ఇతర జంతువులు ఒంటరిగా కనిపిస్తే వాటిపై కుక్కలు పడి చీల్చి తినే దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు, వందల సంఖ్యలో ఇటీవల కాలంలో నమోదు అవుతున్నాయి. లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా సుమారు 20 వేల మంది వరకు వీధికుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తోంది. ఎక్కడైనా కుక్కల గుంపు కనిపిస్తే చాలు చాలామంది గుండె దడపడుతూ ఏం చేయాలో తెలియక కంగారు పడిపోతున్నారు.

సాధారణంగా కుక్కలు వెంబడిస్తే మనలో చాలామంది చేసే మొదటి పని పరిగెత్తడం లేదా గట్టిగా అరవడం. కానీ ఈ చర్యలే చాలాసార్లు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. మీరు నడుచుకుంటూ వెళ్తున్నా, బైక్‌పై ఉన్నా అకస్మాత్తుగా కుక్కలు వెంటపడితే పరిగెత్తకపోవడం చాలా ముఖ్యం. భయంతో వేగంగా పరుగెత్తితే లేదా బైక్‌ను స్పీడ్‌గా తోలితే సమతుల్యం తప్పి పడిపోవడం, తీవ్ర గాయాలు కావడం లేదా కుక్కలకు సులభంగా దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. అక్కడే నిలబడి కుక్కల వైపు కాకుండా మరో వైపు దృష్టి పెట్టడం మంచిది. కొన్ని సందర్భాల్లో కుక్కలు దగ్గరకు వచ్చి వాసన చూస్తుంటాయి. అప్పుడు భయపడకుండా నిశ్చలంగా ఉండాలి. అలా ఉంటే అవి పెద్దగా ఆసక్తి చూపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుక్కల కళ్లలోకి నేరుగా చూడకూడదు. మనం నేరుగా వాటి కళ్లలోకి చూస్తే అది సవాలుగా భావించి మరింత దూకుడుగా మారుతుంది. ముఖ్యంగా కుక్కల గుంపు మధ్యలో అనుకోకుండా చిక్కుకున్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. చేతుల్లో ఏదైనా ఆయుధం లేకుండా వాటిపైకి దూకే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే అవి మిమ్మల్ని శత్రువులుగా భావించి గుంపుగా దాడికి దిగే ప్రమాదం ఉంది. బదులుగా నెమ్మదిగా వెనక్కి తగ్గుతూ లేదా పక్కకు జరుతూ దూరం పెంచుకోవాలి. చాలా సందర్భాల్లో ఇలా చేస్తే కుక్కలు కూడా క్రమంగా శాంతిస్తాయి.

చాలామంది చేసే మరో పెద్ద పొరపాటు గట్టిగా అరవడం. భయంతో కేకలు వేయడం కుక్కలకు మరింత కోపాన్ని తెప్పిస్తుంది. ఆ శబ్దాన్ని అవి ముప్పుగా భావించి దాడి చేసే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి కుక్కలు ఎదురైనప్పుడు ఎంత కష్టం అయినా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అవి దగ్గరకు వస్తే నెమ్మదిగా పక్కకు జరగాలి. బైక్‌పై వెళ్తున్నప్పుడు కుక్కలు వెంబడిస్తే ఒక్కసారిగా స్పీడ్ పెంచకుండా, అవసరమైతే వాహనాన్ని ఆపి కింద దిగడం కూడా కొన్ని సందర్భాల్లో సురక్షితంగా ఉండొచ్చు. ముఖ్యంగా రోడ్లపై ఇతర వాహనాలు ఉన్నప్పుడు స్పీడ్ పెంచడం వల్ల ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మొత్తానికి వీధికుక్కల సమస్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, భయపడటంతో పాటు సరైన అవగాహన కూడా చాలా అవసరం. కంగారు పడకుండా, ఆలోచించి, నెమ్మదిగా స్పందిస్తే చాలాసార్లు ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు, పాలకులు కూడా వీధికుక్కల నియంత్రణపై గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

ALSO READ: హృదయాన్ని హత్తుకునే వీడియో.. పసికందు ప్రాణాలు కాపాడిన డిటెక్టివ్‌.. నెటిజన్ల ప్రశంసలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button