Unnao Rape Case: ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు కులదీప్ సింగ్ సెంగార్ వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఇద్దరు న్యాయవాదులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మరో వైపు ఇదే విషయమై సీబీఐ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. 2017లో జరిగిన రేప్ కేసులో సెంగార్‌కు ట్రయల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై ఆయన హైకోర్టులో అప్పీలు చేశారు. ఆ అప్పీలు ఇంకా పెండింగ్‌లో ఉండడం, ఇప్పటికే ఏడేళ్ల అయిదు నెలల పాటు జైలులో ఉండడంతో ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ శిక్షను మంగళవారం సస్పెండ్ చేసింది. పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
సుప్రీం కోర్టులో సవాల్ చేసిన న్యాయవాదులు
హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు అంజలే పటేల్, పూజా శిల్పాకర్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చనిపోయే వరకు జైలులోనే ఉండాలంటూ ట్రయిల్ కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ దాన్ని గుర్తించడంలో హైకోర్టు విఫలమయిందని తెలిపారు. తీవ్రమైన నేరపూరిత చరిత్ర, కూర్రమైన నేరాలకు పాల్పడ్డ ఉదంతాలు ఉన్నప్పటికీ శిక్షను సస్పెండ్ చేసి, బెయిల్ ఇవ్వడం తగదన్నారు. ధన, కండ బలంతో పాటు నేరపూరిత స్వభావం కలిగి ఉన్నారనేందుకు ఆధారాలు ఉన్నాయని, కేసు దర్యాప్తు సమయంలోనే బాధితురాలి తండ్రి జ్యుడీషియల్ కస్టడీలో మరణించడం ఇందుకు నిదర్శనమని వివరించారు. బాధిత కుటుంబాన్ని భయపెట్టి, న్యాయ ప్రక్రియను అడ్డుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వకూడదని కోరారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలపై వెంటనే సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని సీబీఐ ప్రధాన అధికార ప్రతినిధి తెలిపారు.





