ఆంధ్ర ప్రదేశ్

కొడాలి నాని అరెస్ట్ ఉత్తదే.. పాస్ పోర్టు లేకుండా ఎలా పారిపోతా!

ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేశారంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. కోల్ కతా విమానాశ్రయంలో కొడాలి నానిని అరెస్ట్ చేశారన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఆయన్ను అరెస్టు చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఆయన అరెస్టు అయ్యాడని వస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని సూచించారు.

వైసీపీ కీలక నేత కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. కోల్ కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏపీలో నమోదైన కేసులో కొడాలి నాని మీద గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొలంబో వెళ్లడానికి ప్రయత్నించిన కొడాలి నానిని.. కోల్ కతా ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు.. అక్కడి నుంచి విజయవాడకు తీసుకువస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

కొడాలి నాని గత కొద్ది రోజులులగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. ఈ మధ్యే గుండె సంబంధ ఆపరేషన్ చేశారు. ఆయన ప్రస్తుతం ముంబైలో ఉన్నారని, త్వరలో ఏపీకి వస్తారని వైసీపీ నాయకులు చెప్పారు.

గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, ఆయన కొడుకు, ప్రస్తుత మంత్రి లోకేష్ మీద ఘాటుగా మాట్లాడేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు ఆయనపై పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో నాని మీద కేసులు నమోదు అయ్యాయి. కొంత కాలంగా నాని ఏపీలో లేకపోవడంతో పోలీసులు ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఏపీ పోలీసులు దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button