ఆంధ్ర ప్రదేశ్

పవన్ కల్యాణ్ దెబ్బ.. హోం మంత్రి అనిత పీఏ పై వేటు

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆమె వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న సంధు జగదీష్‌పై వేటు వేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని హోంమంత్రి అనిత పీఏ జగదీష్‌పై చాలా ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందని టీడీరీ నేతలు చెబుతూ వస్తున్నారు. అనితను వివిధ పనులపై కలవటానికి వచ్చిన వారు తొలినుంచీ పీఏ జగదీశ్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు.

జగదీష్‌ గత పదేళ్లుగా అనిత వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాకా జగదీశ్ రెచ్చిపోతున్నాడు. ఎంత పెద్ద నాయకుడినైనా కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవారని ఫిర్యాదులు వచ్చాయి. అయితే పీఏపై విమర్శలొచ్చినా అనిత ఆయన్ను తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారనే టాక్ వచ్చింది. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత.. జగదీష్‌ను పీఏగా తొలగించారు.

జగదీష్‌ అరాచకాల్ని సహించలేకపోయిన ఎస్‌.రాయవరం మండలానికి చెందిన టీడీపీ నేతలు కొందరు అంతర్గతంగా ఓ సమావేశం పెట్టుకున్నారు. ఆయన తీరును హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగదీష్‌ ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులకు ఫోన్‌ చేసి.. ‘ఏం చేసుకుంటారో.. చేసుకోండి’ అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. దీంతో హోం మంత్రికి భయపడి.. వారెవరూ అప్పట్లో నోరు విప్పలేకపోయారు.ఎస్‌.రాయవరం మండలంలోని రెండుచోట్ల దాదాపు నెల రోజులపాటు, పాయకరావుపేట మండలంలో పాల్విన్‌పేటల్లో కొన్ని రోజులపాటు పేకాట శిబిరాలు నడిచాయి. జగదీష్‌ మద్దతుతోనే వీటిని నడిపించారనే ఆరోపణలున్నాయి. మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్‌ అధికారుల ద్వారా లైసెన్సుదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జగదీష్‌పై ఆరోపణలు ఉన్నాయి.హోం మంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలను సైతం జగదీష్‌ తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌కు గంపగుత్తగా అమ్మేశారని ఆరోపణలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button