
Telangana – AP Rains: తెలంగాణలో చాలా జిల్లాల్లో ఎండలు భగ్గునమండుతున్నాయి. వర్షాలు కురవాల్సి ఉన్నా, రాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈశాన్య బంగాళా ఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వెల్లడించింది. దీని కారణంగా రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించి.. వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏపీలోనూ భారీ వర్షాలు
అటు ఆంధ్రాలోనూ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అల్లూరి, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు
అటు వచ్చే 24 గంటల్లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సౌరాష్ట్ర కచ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, తీరప్రాంత కర్ణాటక, ఉత్తర కేరళ, ఒడిశా, జార్ఖండ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రాబోయే 3 రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీలోనూ ఉరుములతో కూడిన వానలు పడుతాయన్నారు. జూలై 18 వరకు దేశ రాజధానిలో నిరంతర వర్షాలు కురుస్తాయన్నారు.
Read Also: శ్రీశైలంలోకి తగ్గిన ఇన్ ఫ్లో, సాగర్ నిండేది ఎప్పుడు?