
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :-వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొందరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అజ్ఞాతంలో ఉన్నారు… ఇప్పుడు మరో నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా అదే బాట పట్టారు. తోపుదుర్తి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఆయన కనిపిస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి… రాప్తాడు మాజీ ఎమ్మెల్యే. ఈ మధ్యన రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త హత్య జరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. అభిమాన నేతను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి దాటికి హెలికాప్టర్ విండ్‌షీల్డ్ కూడా ధ్వంసమైంది. దీంతో… జగన్ రోడ్డుమార్గంలో వెళ్లారు. ఈ అంశం రాజకీయ దుమారం రేపింది. జగన్ పర్యటనలో భద్రత వైఫల్యం ఉందని వైసీపీ ఆరోపించింది. వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టిన కూటమి ప్రభుత్వం… ఇందులో కుట్రకోణం ఉందని విచారణ చేపట్టింది. హెలికాప్టర్ పైలట్‌ను పిలిపించి ప్రశ్నించారు పోలీసులు. వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై స్థానిక రామగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో… ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదవడంతో అరెస్ట్ చేయొచ్చని ముందే ఊహించిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారో ప్రస్తుతానికి సమాచారం లేదు. అనంతపురంలోని తోపుదుర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు… ఆయన ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక… వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే… వారు చేసిన అవినీతి, అక్రమాలే కారణమని కూటమి నేతలు అంటున్నారు. ఇందులో ఎంత నిజముంది..? ఎవరి వాదన సరైంది…? అన్నది తేలాల్సిఉంది. మరోవైపు…. అజ్ఞాతవాసం గడుపుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి… న్యాయపోరాటం చేస్తున్నారు. మరి… తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఏం చేస్తారు..?
పక్షం రోజుల్లో సరస్వతీ పుష్కరాలు…అడుగంటుతున్న గోదావరి నది.. ఆందోళనలో అధికార యంత్రాంగం