
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన ‘అమెజాన్ పే’ మరో కీలక ఆర్థిక సేవను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా అమెజాన్ పే ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెట్టుబడిదారులకు సంవత్సరానికి 8 శాతం వరకు వడ్డీ లభించనున్నట్లు అమెజాన్ పే వెల్లడించింది. డిజిటల్ ఫైనాన్స్ రంగంలో తన సేవలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలను అమెజాన్ పే మొత్తం 5 బ్యాంకులతో కలిసి ప్రారంభించింది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంక్, స్లైస్ మరియు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లతో పాటు రెండు NBFCలు అయిన శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా వినియోగదారులకు భిన్నమైన గడువులు, వడ్డీ రేట్లతో పెట్టుబడి అవకాశాలు కల్పిస్తున్నారు.
అమెజాన్ పే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కనీసం రూ.1000 నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు. వడ్డీ రేట్లు పార్ట్‌నర్ బ్యాంక్, ఎంచుకున్న గడువు ఆధారంగా మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజెన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ లభించనుండగా, మహిళా పెట్టుబడిదారులకు శ్రీరామ్ ఫైనాన్స్ మరో 0.5 శాతం అదనపు వడ్డీని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ అంశాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.
ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా అవసరం లేదని అమెజాన్ పే స్పష్టం చేసింది. పార్ట్‌నర్ బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ.5 లక్షల వరకు బీమా హామీ ఉంటుందని తెలిపింది. దీంతో పెట్టుబడులకు భద్రత కూడా లభిస్తుందని అమెజాన్ పే పేర్కొంది.
ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు అమెజాన్ యాప్ ఓపెన్ చేసి అమెజాన్ పే సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్‌ను ఎంచుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తి చేసిన తర్వాత, తమకు నచ్చిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను, గడువును ఎంపిక చేసుకోవచ్చు. వడ్డీ రేట్లను పోల్చుకుని సులభంగా డిజిటల్ పద్ధతిలో పెట్టుబడి పూర్తిచేయవచ్చు. ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా ఈ ప్రాసెస్ పూర్తవడం మరో విశేషం.
సాధారణ పెట్టుబడిదారుల కోసం వివిధ బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 21 నుంచి 22 నెలల గడువుకు 7.5 శాతం వడ్డీ అందిస్తుండగా, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 18 నెలల గడువుకు 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 నుంచి 3 సంవత్సరాల గడువుకు 8 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ పే కొత్త సేవ డిజిటల్ పెట్టుబడుల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.
ALSO READ: కొడుకు కోసం ఆరాటం.. 11వ కాన్పులో పుట్టిన మగబిడ్డ!





