Anna Hazare Hunger Strike: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టం అమల్లో జాప్యం జరుగుతున్నందుకు నిరసనగా వచ్చే ఏడాది జనవరి 30న తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. లోకాయుక్త చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నా హజారే మండిపడ్డారు. ప్రజాసంక్షేమానికి కీలకమైన ఈ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. చట్టం అమలుకు గతంలో ఇచ్చిన హామీలను పక్కనపెట్టారని ఆరోపించారు.
లోకాయుక్త కోసం 2022లో హజారే నిరసన
లోకాయుక్త చట్టాన్ని తీసుకురావాలంటూ హజారే 2022లో నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, అప్పటి ముఖ్యమంత్రి జోక్యంతో ఆయన దీక్షను విరమించారు. అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది. కానీ, క్షేత్రస్థాయిలోచట్టం అమలు జరగట్లేదని హజారే అన్నారు. ‘ఈ చట్టం ప్రజాసంక్షేమానికి ఎంతో అవసరం. నేను ఈ విషయంపై ఏడు లేఖలు రాశాను. కానీ అవతలి వైపు నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఇలా ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఉన్నదే ప్రజాసంక్షేమానికి, కేవలం ప్రదర్శనకు కాదు’ అంటూ హజారే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ముదరక మునుపే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
లోక్ పాల్ కోసం ఢిల్లీలో నిరసన దీక్ష
అటు కొద్ది సంవత్సరాల క్రితం అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేటీ కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమం చేశారు. లోక్ పాల్ కోసం ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కాగా, కిరణ్ బేడీని మోడీ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించింది. అన్నా హజారే మాత్రం కనిపించకుండాపోయారు. మళ్లీ ఇప్పుడు ఆయన లోకాయుక్త కోసం నిరాహారదీక్షకు దిగుతానని చెప్పడం సంచలనంగా మారింది.





