
Anirudh Reddy: జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాజయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా సొంత నియోజకవర్గంలోనే పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఓటమి పాలవ్వడం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.
గ్రామస్తుల నుంచి ఓట్లు కోరే సమయంలో అభ్యర్థులు చేసే విజ్ఞప్తులను కూడా అవహేళన చేసే రీతిలో ఎమ్మెల్యే మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. గెలిపించకపోతే పురుగుల మందు తాగి చస్తామని అభ్యర్థులు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానిస్తూ ఆయన గేలి చేసిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పును గౌరవించాల్సిన ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడటం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్‌కు చెందిన సర్పంచులు గెలిస్తే వారిని తానే చంపేస్తానని, నిధులు ఇచ్చేది కూడా తానే కాబట్టి తన మాట వినాల్సిందే అన్నట్టుగా ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను అహంకారపూరితంగా ప్రజలపై ఆధిపత్యాన్ని చూపించే ధోరణిగా పలువురు అభివర్ణిస్తున్నారు.
సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా పంచాయతీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా బాలానగర్ మండలం చిన్నరేవల్లి, జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సభా వేదికపైనే ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ చేసిన ప్రసంగం స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైంది.
ఇందిరమ్మ ఇల్లు కావాలంటే తానే సంతకం పెట్టాలని, రేషన్ కార్డులు కావాలన్నా తానే ఇవ్వాలని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే.. తమ ఊర్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా తనను గుండెల మీద కొట్టినట్టుగా ప్రజలు వ్యవహరించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రజలపై బెదిరింపు ధోరణిలో ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల్లో ఓటమిని సహజంగా స్వీకరించకుండా, ప్రజలపై నిందలు వేయడం, అధికారాన్ని ప్రదర్శించేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం జడ్చర్ల రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.





