IAS Officers Daughter Suicide: ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కూతురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వారి నివాసంలో ఆదివారం ఉదయం ఆమె ఆత్మహత్య చేసుకోగా, ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న యువతిది కులాంతర ప్రేమ వివాహం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త మోసం, అత్తింటి వేధింపులే కారణమని తల్లిదండ్రులు చెబుతుండగా.. వారే తన భార్యను హత్య చేశారని యువతి భర్త ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన చిన్నరాముడు, లక్ష్మీభాయి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె మాధురి సాహితి బాయి (25) ఉన్నారు. ఐఏఎస్ హోదాలో ఉన్న చిన్నరాముడు ప్రస్తుతం రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన కూతురు మాధురి బుగ్గానిపల్లె గ్రామానికి చెందిన బోయ రాజేశ్ నాయుడు అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ ఏడాది మార్చి 5న నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో వివాహం చేసుకున్నారు. మాధురి తల్లిదండ్రులు రాజేశ్ తమ కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధురి తన భర్తతో వెళ్తానని చెప్పడంతో పోలీసులు ఆమెను భర్త వెంట పంపించారు. మార్చి 7న యువతి తల్లిదండ్రుల ఆమోదంతో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. మాధురి మూడు నెలల క్రితం ‘మిమ్మల్ని చూడాలని ఉదంటూ’ అంటూ పేరెంట్స్ కు మెసేజ్ పెట్టింది. విషయం మళ్లీ బేతంచెర్ల పోలీసు స్టేషన్ కు చేరింది. పోలీసులు ఇరువర్గాల సమక్షంలో మాధురిని విచారించి ఆమె ఇష్టపూర్వకంగానే తల్లిదండ్రులకు అప్పగించారు.
తండ్రి నివాసంలో మాధురి ఆత్మహత్య
ఆదివారం నాడు తాడేపల్లిలోని తన తండ్రి నివాసంలో మాధురి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను రాజేశ్ నాయుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, పెళ్లి చేసుకొని వేధింపులకు గురిచేశాడని, ఆ వేధింపులకు తాళలేకే బలవన్మరణానికి పాల్పడిందని మాధురి తల్లిదండ్రులు ఆరోపించారు. తన భార్య మాధురి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ రాజేశ్ నాయుడు నంద్యాల ఎస్పీని ఆశ్రయించారు. తన భార్యను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారంటూ ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది.





