ఇద్దరు చంద్రులది ఒకే బాట….!
మొయినాబాద్ ఘటనపై షోకాజ్ నోటీసులు
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ ఆదేశాలు
వారం రోజుల్లో సమాధానం చెప్పాలని సూచన
ప్రత్యేక సిట్ బృందంతో దర్యాప్తు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఇటీవల తెలంగాణలోని మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పట్టుబడ్డారు. ఒకవైపు డ్రగ్స్, మరోవైపు తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మరీ ముఖ్యంగా ఏపీలో అధికార టిడిపి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడం సంచలనం సృష్టించింది.
ఇది తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ చేపడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు షోకాజ్ నోటీస్ జారీచేసింది. ఐదు రోజుల్లో దీనిపై సమాధానం చెప్పాలంటూ స్పష్టం చేసింది. అంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు బాటలోనే కేసీఆర్ నడుస్తుండడం విశేషం.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో…
మొయినాబాద్ లో గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సొంత ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. దీనికి ఏపీకి చెందిన ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు ఈ పార్టీని భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై అక్కడ కాల్పులకు తెగబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏపీ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ పేరు బయటకు రావడం ప్రకంపనలు రేపుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో టిడిపి నాయకత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. నోటీసులు జారీ చేయడమే కాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ సైతం అదే నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపింది. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొంది.
రెండు పార్టీల మధ్య రాజకీయ విభేదాలు…
తెలుగుదేశం పార్టీతో బీఆర్ ఎస్‌కు రాజకీయ వైరుధ్యం ఉంది. ఇది చాలా సందర్భాల్లో కూడా స్పష్టమైంది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు కేసీఆర్. అప్పటినుంచి చంద్రబాబుతో తీవ్ర విభేదాలు ఏర్పడుతూ వచ్చాయి. అయితే రాష్ట్ర విభజనతో కెసిఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే వీరి రాజకీయ విభేదాలు నడుస్తూ వచ్చాయి.
ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకిగా ఉన్న జగన్ కేసీఆర్‌కు మిత్రుడు. తెలంగాణలోని కేసీఆర్ కు వ్యతిరేకి అయిన రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సన్నిహితుడు. గత పుష్కర కాలంగా ఎత్తుకు పైఎత్తులు సాధిస్తూ వచ్చారు ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో విభేదిస్తోంది గులాబీ పార్టీ.
ఇటువంటి సమయంలో ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు కలిసి డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ముందుగా స్పందించి నోటీసులు జారీచేసింది. విచారణకు ఆదేశించింది. అయితే గులాబీ పార్టీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు విమర్శలు రావడంతో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని గులాబీ పార్టీ అనుసరించింది.
