తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఆలోచనతో భావసారూప్యత ఉన్న పార్టీలు ఒక్కటి అవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమితో పట్టాలి మక్కల్ కట్టి (PMK) చేతులు కలిపింది. పీఎంకే అధ్యక్షుడు అంబుమణి రామదాస్ తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలుసుకుని ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు.
తమిళనాట ఎన్డీఏ కూటమి బలోపేతం
అనంతరం అంబుమణి రామదాస్ తో కలిసి పళనిస్వామి మాట్లాడుతూ, కీలక విషయాలు వెల్లడించారు. పీఎంకే చేరికతో తమ కూటమి మరింత బలపడిందని చెప్పారు. మరి కొన్ని పార్టీలు కూడా తమతో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయన చెప్పారు. తమది విక్టరీ అలయెన్స్ అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించేది ఎన్డీయే కూటమే అన్నారు.
అధికార డీఎంకేపై ప్రజల ఆగ్రహం
అటు అన్నాడీఎంకే నాయకత్వంలో ఎన్డీయేలో చేరేందుకు పీఎంకే చేతులు కలిపినట్టు అంబుమణి రామదాస్ తెలిపారు. మహిళల భద్రత, రైతులు, నిరుద్యోగం వంటి అంశాల్లో అధికార డీఎంకేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా తాము పని చేస్తామని చెప్పారు. భారీ మెజారిటీతో గెలిచి అన్నాడీఎంకే నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రామదాస్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాదిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో పార్టీ గెలుపై బీజేపీ కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా తమ కూటమిని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది.





