
America vs Russia: అమెరికా, రష్యా మధ్య కొత్తలొల్లి మొదలయ్యింది. రష్యాకు సమీపంలోని సముద్ర జలాల్లో రెండు న్యూక్లియర్ సబ్ మెరైన్లను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేవీని ఆదేశించారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ చేస్తున్న హెచ్చరికలకు ప్రతిస్పందనగా.. ఈ చర్యను చేపట్టినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఉక్రెయిన్ తో కాల్పుల విరమణకు 10 రోజుల్లో ముందుకు రావాలని ట్రంప్.. రష్యాకు హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెద్వెదేవ్ స్పందించారు. రష్యా దగ్గర సోవియట్ హయాం నాటి అణు దాడి సామర్థ్యం ఉందనే విషయాన్ని ట్రంప్ మర్చిపోకూడదన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన నేవీకి కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాకు రష్యా కౌంటర్
తమకు చేరువలో సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అమెరికా మోహరించిన నేపథ్యంలో.. రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దగ్గర కూడా తగినన్ని న్యూక్లియర్ సబ్ మెరైన్లు ఉన్నాయన్నారు. “అమెరికాను ఎదుర్కొనేందుకు అవసరమైన అణు జలాంతర్గాములు మాదగ్గర కూడా ఉన్నాయి. సముద్రాల్లో యూఎస్ జలాంతర్గాముల సంఖ్య కంటే తమవి చాలా ఎక్కవగా ఉన్నాయి. వారు మోహరించిన సబ్ మెరైన్లు.. మా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయి. ట్రంప్ ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు” అని ఆయన వెల్లడించారు. మరోవైపు కొత్తగా అభివృద్ధి చేసిన ఒరెష్నిక్ హైపర్ సోనిక్ క్షిపణుల ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. వాటిని తమ సైన్యంలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. బెలారస్ లోనూ వీటిని ఈ ఏడాది చివరగా మోహరిస్తామని చెప్పారు.