
బంగాళాదుంపలు చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఉడికించినా, వేయించినా, కాల్చుకున్నా రుచిలో ఎలాంటి తేడా ఉండదు. పకోడాలు, కట్లెట్లు, పరోటాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఎన్నో వంటకాల్లో బంగాళాదుంపలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ రుచికరమైన కూరగాయను ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి అంతగా మేలు చేయదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నెల రోజుల పాటు బంగాళాదుంపలు తీసుకోవడం మానేస్తే శరీరంలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని నిపుణుల అభిప్రాయం.
సాధారణంగా బంగాళాదుంపలను ఎక్కువ నూనెలో వేయించి తీసుకుంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి వాటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. నెల రోజుల పాటు వీటిని ఆహారంలో నుంచి తొలగిస్తే శరీరానికి చేరే అదనపు క్యాలరీలు తగ్గుతాయి. దీని వల్ల బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి ఇది మంచి మార్గంగా భావించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బంగాళాదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచే లక్షణం కలిగి ఉంటాయి. అందుకే మధుమేహం ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. నెల రోజుల పాటు బంగాళాదుంపలు మానేస్తే కార్బోహైడ్రేట్ తీసుకునే పరిమాణం తగ్గుతుంది. దీని వల్ల గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండటంతో పాటు జీవక్రియ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.
ఇక బంగాళాదుంపలతో తయారయ్యే ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్డ్ ఆహారాల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి తరచూ తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఇలాంటి ఆహారాన్ని మానేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఉప్పు నియంత్రణ అవసరమైనవారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
అయితే బంగాళాదుంపలు పూర్తిగా చెడ్డవే కాదు. వీటిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల బంగాళాదుంపల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. అందుకే వేయించిన వాటికంటే ఆవిరితో ఉడికించిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు.
బంగాళాదుంపలకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. కట్లెట్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలో బంగాళాదుంపల స్థానంలో పనీర్ లేదా సోయాను ఉపయోగించవచ్చు. అలాగే సాధారణ బంగాళాదుంపలకు బదులుగా చిలగడదుంపలను తీసుకోవచ్చు. ఇవి పోషక విలువల్లో మెరుగ్గా ఉండటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావం చూపుతాయి.
ఇంకా క్యాలీఫ్లవర్, టర్నిప్ వంటి రూట్ వెజిటబుల్స్ కూడా మంచి ప్రత్యామ్నాయాలు. టర్నిప్ తక్కువ కార్బ్ కలిగి ఉండటంతో స్టూ, సూప్ లేదా కాల్చుకుని తినడానికి అనువుగా ఉంటుంది. అలాగే పచ్చి అరటికాయను వేయించి లేదా కాల్చుకుని తినవచ్చు. అరటికాయ చిప్స్ కూడా మంచి రుచితో పాటు కొంతవరకు ఆరోగ్యకరమైన ఎంపికగా చెప్పవచ్చు.
కొంతమందిలో బంగాళాదుంపలు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తాయి. మధుమేహం ఉన్నవారు, తక్కువ కార్బ్ డైట్ పాటించే వారు, అలర్జీలు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు, బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు బంగాళాదుంపలను దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మితంగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుంటే బంగాళాదుంపల వల్ల కూడా శరీరానికి కొంత మేలు చేకూరుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: Double Bonanza: సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి గ్రూప్-2 కొట్టిన భార్యాభర్తలు





