
Amarnath Yatra 2025: అత్యంత సవాళ్లతో కూడిన అమర్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. వర్ష బీభత్సానికి ఓ భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. కొండచరియలు విరిగిపడి అందరూ చూస్తుండగానే ఓ మహిళ చనిపోయింది. భారీ వర్షాల కారణంగా గందర్ బాల్ జిల్లా బల్తల్ ప్రాంతంలో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే దారులు దారుణంగా తయారయ్యాయి. కొండ చరియలు విరిగి బురద మట్టితో కలిసి కిందికు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బల్తల్ దారిలో కొండపైకి వెళుతున్న కొంతమంది భక్తులు బురదలో జారి కొట్టుకుపోయారు. వీరిలో ఓ మహిళా భక్తురాలు చనిపోయింది. మరికొంత మంది గాయపడ్డారు. అటు వర్షాల నేపథ్యంలో NDRF,SDRF బృందాలు, పోలీసులు రంగంలోకి దిగారు. వర్షంలో కొండపై చిక్కుకుపోయిన వారిని సురక్షితమైన ప్రదేశానికి తరలించారు.
అమర్ నాథ్ యాత్ర రద్దు!
భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికారులు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు ఈ యాత్ర ప్రారంభం అవుతుంది? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. వర్షం కారణంగా యాత్ర సాగే రెండు దారులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. యాత్ర సాగే రెండు దారులను బాగుచేస్తోంది. అయినప్పటికీ వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఓ వైపు దారులను బాగు చేస్తుంటే, మరోవైపు ధ్వంసం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమర్ నాథ్ యాత్రను కొద్ది రోజులు నిలిపివేయడం మంచిదని అధికారులకు సూచించారు. వారి సూచలన మేరకు ప్రస్తుతం ఈ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ యాత్ర మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే విషయాన్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
Read also: ఇవాళ, రేపు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!