* జగన్ గ్రీన్ సిగ్నల్
* చీరాల టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం
క్రైమ్ మిర్రర్, ఏపీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్లాన్ తో ఉందా? పెద్ద ఎత్తున నేతల చేరికకు ప్లాన్ చేస్తోందా? చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారా? ఒక ఊపు తేవాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. త్వరలో ప్రకాశం జిల్లా కు చెందిన సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో ఆమంచి ఫ్యాన్ గూటికి చేరడం ఖాయమని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది.
మంచి పట్టున్న నేత..
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ ది ప్రత్యేక స్థానం. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కృష్ణమోహన్. 2000లో వేటపాలెం జడ్పిటిసి సభ్యుడిగా గెలిచారు. 2006లో అదే వేటపాలెం ఎంపీపీగా విజయం సాధించారు. 2004లో చీరాల నుంచి కొనిజేటి రోశయ్య ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన విజయానికి కీలకంగా వ్యవహరించారు ఆమంచి కృష్ణమోహన్. అయితే 2009 ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు రోశయ్య. అలా టికెట్ తగ్గించుకున్నారు ఆ మంచి కృష్ణమోహన్. చీరాల నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి గెలిచారు కాంగ్రెస్ అభ్యర్థిగా. అలా అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. అటు తర్వాత ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. టిడిపి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ సభ్యుడిగా కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో తిరిగి చేరారు. చీరాల నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ టిడిపి అభ్యర్థి కరణం బలరామకృష్ణ చేతిలో ఓడిపోయారు. అయితే అక్కడకు కొన్ని రోజులకే కరణం బలరామకృష్ణ వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆమంచి కృష్ణమోహన్ ను వేరే నియోజకవర్గానికి పంపించారు. 2024 ఎన్నికల్లో చీరాల టికెట్ లేదని చెప్పడంతో ఆమంచి కృష్ణమోహన్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
మంచి ఆఫర్..
అయితే ఈసారి చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఉన్న కరణం బలరామకృష్ణను అద్దంకి నియోజకవర్గానికి పంపించి.. చీరాలను ఆమంచి కృష్ణమోహన్ కు ఇవ్వాలని చూస్తున్నారట. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు ఆమంచి కృష్ణమోహన్. ఆయనకు సైతం ప్రత్యామ్నాయం లేదు. ఈ పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేయడంతో ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే గతం మాదిరిగా హాండ్ ఇస్తే ఊరుకునేది లేదని గట్టిగానే ఆమంచి కృష్ణమోహన్ చెప్పినట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికలకు ముందే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
