
Modi- Putin Meet: చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఆసక్తిర దృశ్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వేదికపై ఒకరికొకరు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. ఎంతో సంతోషంగా పలకరించుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ, పుతిన్ టియాంజిన్ లో చర్చలు జరిపారు. పుతిన్ తో భేటీ విషయాన్ని ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మోడీ, పుతిన్ భేటీపై ప్రపంచం ఆసక్తి
అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో చమురు కొనుగోళ్లను బూచీగా చూపి భారత దిగుమతులపై 50% సుంకాలను విధించిన నేపథ్యంలో, ఇద్దరు నాయకుల మధ్య కీలక సమావేశం జరిగింది. జూలైలో, ఉక్రెయిన్‌పై శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే రష్యాపై 100% సుంకాలను విధించాలని కూడా ట్రంప్ బెదిరించారు. రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై జరిమానాలు కొనసాగిస్తానని కూడా ఆయన చెప్పారు. ఉక్రెయిన్ పరిస్థితిని చర్చించడానికి ట్రంప్, పుతిన్ అలాస్కాలో కలిసిన దాదాపు వారం రోజల తర్వాత ప్రధాని మోడీ, పుతిన్ మధ్య తాజా సమావేశం జరిగింది. అటు ఈ సమావేశానికి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ కూడా మోడీకి ఫోన్ చేయడంతో ఈ సమావేశంలో ఆ యుద్ధం గురించి ఏమైనా చర్చించారా? యుద్ధానికి ఫుల్ స్టాఫ్ పెట్టేలా ప్రధాని మోడీ ఏదైనా ప్రయత్నం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది.