
Alia-Ranbir Kapoor: బాలీవుడ్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్టార్ కపుల్స్‌లో అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వారు తమ తమ కెరీర్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ అభిమానులతో తరచూ తమ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా అలియా భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండడం వల్ల ఆమె షేర్ చేసే ప్రతి ఫోటో, వీడియో అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారుతుంది.
ఇటీవల ఆమె కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చాక ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారాయి. అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో చాలా కాలంగా తమ కలల ఇంటిని నిర్మిస్తున్నారు. విలాసవంతమైన ఇంటిని నిర్మించడానికి ఈ జంట రూ.250 కోట్ల వరకు ఖర్చు పెట్టారని గతంలో వచ్చిన వార్తలు ఎక్కువగా దృష్టిని ఆకర్షించాయి. ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యాక, చివరకు ఈ దంపతులు తమ స్వప్న గృహంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది.
ప్రత్యేకంగా దీపావళి పండుగను పురస్కరించుకొని గృహప్రవేశ కార్యక్రమం జరిపినట్టు సమాచారం. అయితే ఈ కార్యక్రమం జరిగిన కొన్ని వారాల తరువాత మాత్రమే అలియా భట్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఆలస్యంతో మరింత ఆసక్తి పెరగగా, ఆమె పెట్టిన ఫోటోలు చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 6న రాహా పుట్టినరోజు వేడుకలను కూడా కొత్త ఇంట్లోనే ఘనంగా నిర్వహించినట్టు ఆమె షేర్ చేసిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
అభిమానుల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన విషయమేంటంటే.. ఈ రూ.250 కోట్ల విలాసవంతమైన భవనాన్ని పూర్తిగా తమ కుమార్తె రాహా పేరుమీద రిజిస్టర్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ కొత్త ఇంటి రూపంలో దంపతులు తమ కుమార్తెకు అరుదైన కానుకను అందించినట్టే. కుటుంబ సభ్యుల సమక్షంలో, అత్యంత వ్యక్తిగత వాతావరణంలో ఈ వేడుకలు జరిగినట్టుగా సమాచారం.
ఇక అలియా భట్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ‘ఆల్ఫా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్‌లో వరుసగా మంచి కథలతో, మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలతో ముందుకు సాగుతున్న అలియా భట్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక రణబీర్ కపూర్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి నిలిచింది.
ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగం షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తోంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించడం ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ 2026 దీపావళి పర్వదినం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.
ALSO READ: Facts: ప్రపంచంలో ఒక్క విమానాశ్రయం కూడా లేని 5 దేశాలు ఏవి?





