
గత రెండు రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు జోరుగా పడ్డాయి. వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతున్నది. అత్యధికంగా ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వెంకటాపురం తహశీల్ పరిధిలో 25.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం (జూన్ 24)న కూడా కుండపోత వానలు పడనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
ఇక తెలంగాణలో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని వెల్లడించారు. ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రం భీమ్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వర్షాలుకు కురుస్తాయని అంచనా వేశారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
అటు మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హనుమకొండ, వరంగల్, జనగామ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌తో సహా మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, పిడుగులతో కూడిన వాన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రాకపోవడం మంచిదని సూచించారు.