
తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే అప్లై చేసిన వారు తమ రేషన్ కార్డు దరఖాస్తు స్టేటస్‌ను సులభంగా ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డు మంజూరైందా లేదా అనే విషయాన్ని అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్స్ శాఖ నిర్వహిస్తున్న అధికారిక వెబ్‌సైట్ epds.telangana.gov.in/FoodSecurityAct ను ముందుగా సందర్శించాలి. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజీలో FSC Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, స్క్రీన్‌పై Ration Card Search అనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల వివరాలతో పాటు, కొత్తగా దరఖాస్తు చేసిన వారి అప్లికేషన్ స్టేటస్‌ను కూడా తెలుసుకునే సౌకర్యం ఉంటుంది.
కొత్త రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా FSC Application Search అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మీ జిల్లా పేరును డ్రాప్‌డౌన్‌లో నుంచి సెలెక్ట్ చేయాలి. జిల్లా ఎంపిక చేసిన తర్వాత, మీకు రేషన్ కార్డు అప్లికేషన్ సమయంలో ఇచ్చిన అప్లికేషన్ నంబర్‌ను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసిన తర్వాత Search బటన్‌పై క్లిక్ చేయాలి.
సెర్చ్ చేసిన వెంటనే మీ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో మీ అప్లికేషన్ ప్రస్తుత స్థితి స్పష్టంగా చూపిస్తారు. స్టేటస్‌లో Approved అని ఉంటే, మీకు కొత్త రేషన్ కార్డు మంజూరైనట్టే. అదే Pending లేదా Under Process అని ఉంటే, ఇంకా పరిశీలన దశలో ఉందని అర్థం. అవసరమైన పత్రాల లోపం ఉంటే, సంబంధిత వివరాలు కూడా అక్కడే కనిపించే అవకాశం ఉంది.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆన్‌లైన్ విధానం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపశమనం కలుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, మహిళలు కార్యాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా సులభంగా స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది. కొత్త రేషన్ కార్డుల మంజూరులో పారదర్శకత పెంచేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కాబట్టి రేషన్ కార్డు కోసం అప్లై చేసిన ప్రతి ఒక్కరు తరచుగా స్టేటస్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. Approved స్టేటస్ వచ్చిన తర్వాత, స్థానిక రేషన్ షాప్ లేదా సంబంధిత అధికారుల ద్వారా కార్డు పొందే ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ALSO READ: రాత్రిపూట భార్యను చంపి, అనంతరం 16 ఏళ్ల కూతురిపై దారుణానికి ఒడిగట్టాడు..





