
ALERT: తెలంగాణను ప్రస్తుతం చలిపులి గట్టిగా వణికిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తీవ్రమైన శీతల గాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రానున్న 4 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
సాధారణంగా చలికాలంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఈసారి కూడా ముందంజలో ఉంది. ఈ జిల్లాలో కనీస ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలిగాలుల తీవ్రత వల్ల శరీరంపై ప్రభావం ఎక్కువగా పడుతుందని, ముఖ్యంగా రాత్రివేళ బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న 3 నుంచి 4 రోజుల పాటు నగరంలో కనీస ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నగర పరిధిలోని శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, సైనిక్‌పురి, బోడుప్పల్, కీసర, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాల్లో ఇప్పటికే అతల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ఉదయం పూట పొగమంచు దట్టంగా కమ్ముకుంటుండటంతో సాధారణ జీవనం ఇబ్బందికరంగా మారింది.
పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉదయం 8 గంటల తర్వాతే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే వాహనదారులు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని హెచ్చరిస్తున్నారు. పొగమంచు కారణంగా ముందున్న వాహనం స్పష్టంగా కనిపించకపోవడంతో లైట్ డిప్ వేసుకొని, మితమైన వేగంతోనే ప్రయాణించాలని సూచిస్తున్నారు. ఉదయం ట్రాఫిక్ తక్కువగా ఉందని వేగంగా వెళ్లకుండా జాగ్రత్తగా నడపాలని అధికారులు చెబుతున్నారు.
అదేవిధంగా ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లే వారు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రహదారులపై పొగమంచు వల్ల దూరం అంచనా వేయడం కష్టంగా మారుతుండటంతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ చలి పరిస్థితులు వచ్చే జనవరి వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని చలికాలాన్ని ఎదుర్కోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Social Service: తెలుగువాళ్ల కోసం రూ.10కే దోశ.. ఎక్కడో తెలుసా?





