
ALERT: తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో తెలంగాణలో గత పదేళ్ల వాతావరణ రికార్డులు బద్దలవుతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వీస్తున్న అతిశీతల గాలుల ప్రభావంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఈ చలి ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చలిగాలులతో పాటు పొగమంచు కూడా పెరిగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు.
ఇంతటి చలిని ఎప్పుడూ చూడలేదని హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. తెల్లవారుజామున బయటకు రావాలంటే స్వెట్టర్లు, జాకెట్లు, మంకీ క్యాప్‌లు తప్పనిసరి అయ్యాయి. గత మూడు రోజులుగా చలి మరింత పెరిగిందని నగరవాసులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కనిష్ఠంగా 10.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వగా, శివారు ప్రాంతమైన పటాన్‌చెరులో ఏకంగా 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో 7.2 డిగ్రీలు, హన్మకొండలో 8.5 డిగ్రీలు నమోదయ్యాయి. రామగుండంలో ఉష్ణోగ్రత 10.9 డిగ్రీలకు పడిపోయింది. నిజామాబాద్‌లో 11.2, ఖమ్మంలో 12.4, మహబూబ్‌నగర్‌లో 13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నల్గొండలో 14 డిగ్రీలు, భద్రాచలంలో 14.6 డిగ్రీల వరకు చలి తీవ్రత నమోదైంది.
తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలితో వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు తీవ్రంగా కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మన్యం జిల్లాల్లో చలి గజగజలాడిస్తోంది. పాడేరు, అరకులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 4 డిగ్రీల వరకు పడిపోవడంతో నీరు గడ్డకట్టే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ భూముల్లోని నీరు కూడా గడ్డకట్టడంతో రైతులు ఉదయం వేళ పొలాల వైపు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. చలి తీవ్రత కారణంగా పంటలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలపై కూడా చలి పంజా విసురుతోంది. పలుచోట్ల కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో కనిష్ఠంగా 7.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వగా, గరిష్ఠంగా 16 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో హిమపాతం చోటుచేసుకుంది. పుల్వామా, షోపియాన్ ప్రాంతాల్లో మైనస్ 5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్, కుప్వారాలో మైనస్ 3.6 డిగ్రీలు, కాజిగుండ్‌లో 2.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉత్తరాఖండ్‌కు కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేయగా, యూపీ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్నాయి. దేశవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ALSO READ: Interesting Fact: ఇదెక్కడి వింత ఆచారం?.. ఈ గ్రామంలో 5 రోజులు మహిళలు నగ్నంగా..





