* కాన్పూర్ ఫోక్సో కేసులో కీలక ట్విస్ట్
* తన బావ కలలో రేప్ చేశాడన్న బాలిక
* కీలక తీర్పు ఇచ్చిన న్యాయస్థానం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నమోదైన ఒక పోక్సో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మ్యాన్‌గా పనిచేస్తున్న అనురాగ్ శుక్లాపై లైంగిక దాడి ఆరోపణలు నమోదయ్యాయి. అయితే ఏడేళ్ల పాటు కొనసాగిన విచారణ అనంతరం కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
అనురాగ్ శుక్లాపై ఫోక్సో కేసు
అనురాగ్ శుక్లాకు 2019 ఫిబ్రవరి 10న శివానీ అనే మహిళతో వివాహం జరిగింది. అదే ఏడాది మార్చి 9న, తన అక్క ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బావ అనురాగ్ శుక్లా తనపై లైంగిక దాడి చేశాడని శివానీ సోదరి అయిన 15 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు 3న నౌబస్తా పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం సెప్టెంబర్ 29న పోలీసులు అనురాగ్ శుక్లాను అరెస్ట్ చేశారు. 19 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు అక్టోబర్ 17న బెయిల్ లభించింది.
కలలో రేప్ జరిగిందన్న బాలిక
ఈ కేసు పోక్సో ప్రత్యేక కోర్టులో సుదీర్ఘంగా విచారణకు వచ్చింది. విచారణ సమయంలో బాలిక తన మొదటి వాంగ్మూలాన్ని మార్చింది. ఆ రోజు తాను యాంటీబయాటిక్స్ తీసుకున్న కారణంగా నిద్ర మత్తులో ఉండగా, బావ తనపై దాడి చేసినట్లు కల వచ్చిందని కోర్టుకు తెలిపింది. భయంతో మేల్కొని అరిచినట్లు వివరించింది. తండ్రి, అక్క శివానీ కూడా ఇది అపార్థం వల్ల నమోదైన కేసు అని కోర్టుకు చెప్పింది.
శుక్లాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
ఈ వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకున్న పోక్సో కోర్టు న్యాయమూర్తి రష్మీ సింగ్, అనురాగ్ శుక్లాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసు కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని అనురాగ్ శుక్లా తెలిపారు. సామాజిక అపఖ్యాతి వల్ల తన కెరీర్ అవకాశాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. 2020లో ఎయిర్‌ఫోర్స్‌లో కార్పోరల్ పదోన్నతి పొందలేకపోయానని, ప్రస్తుతం ఎయిర్క్రాఫ్ట్మ్యాన్గా కొనసాగుతున్నానని వెల్లడించారు.
