HomeజాతీయంPM Modi Slams Congress: ఇప్పటికే జనం మీ బట్టలు ఊడదీశారు, ఇప్పుడు మీరే విప్పుకుంటున్నారు!

PM Modi Slams Congress: ఇప్పటికే జనం మీ బట్టలు ఊడదీశారు, ఇప్పుడు మీరే విప్పుకుంటున్నారు!

  • ఏఐ సదస్సు వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తల తీరుపై మీరట్‌ సభలో ప్రధాని ఆగ్రహం
  • ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు సక్సెస్ ను కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని మండిపాటు

ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియా ఏఐ  ఇంపాక్ట్‌ సదస్సు విజయవంతం కావడం కాంగ్రెస్‌ సహించలేకపోతోందని ప్రధాని మోడీ అన్నారు. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు కొందరు ఆ సదస్సు వద్ద చొక్కాలు విప్పి హల్‌చల్‌ చేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ మురికి, నగ్న రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆ పార్టీ బట్టలు జనాలు ఊడదీశారని, ఇంకా చొక్కాలు విప్పాల్సిన అవసరం ఏముందని ఎద్దేవా చేశారు.

యూపీలోని మీరట్‌లో నమో భారత్‌ రైలును, విస్తరించిన మెట్రో రైలును, రూ.12,930 కోట్లతో పూర్తిచేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. “ఏఐ సదస్సు లో  కాంగ్రెస్‌ నిరసన.. ఆ పురాతన పార్టీ సైద్ధాంతిక దివాలాకోరుతనానికి, పతనానికి నిదర్శనం. సొంత దేశాన్నే అప్రతిష్ఠ పాలు చేస్తోంది. కాంగ్రెస్‌ నేతలు నన్ను ద్వేషిస్తున్నారు. నాకు సమాధి తవ్వాలనుకుంటున్నారు. చివరకు నా తల్లిని అవమానించేందుకూ వెనుకాడడం లేదు. కానీ, ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని వారు గుర్తుంచుకోవలసింది. ఇది జాతీయ కార్యక్రమం. కాంగ్రెస్‌ సభ్యత మరచి వ్యవహరించింది. అన్ని హద్దులూ దాటేసింది. వారి ప్రవర్తనను దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనకు సిగ్గుపడాల్సింది పోయి.. దేశాన్ని అవమానించినవారిని హీరోలుగా చిత్రిస్తోంది” అని మండిపడ్డారు.

కాంగ్రెస్ తీరును ఖండించిన విపక్షాలకు ధన్యవాదాలు

కాంగ్రెస్‌ కార్యకర్తల తీరును ఖండించిన ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవి జాతీయాభిమానం, సత్యం వైపు నిలిచాయని కొనియాడారు. ఒక్క కాంగ్రెస్‌ నేతలు మాత్రమే ఇలాంటి నిరసనకు దిగారని.. దాని మిత్రపక్షాలైన టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వంటి పార్టీలకు ప్రమేయం లేదని చెప్పారు.

కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన అఖిలేష్

ఇండియా కూటమిలోని పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ యువజన కాంగ్రెస్‌ నేతల తీరును ఖండించారు. అధికార పార్టీ అయిన బీజేపీతో రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ విదేశీ ప్రతినిధుల ఎదుట దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఇలా నిరసన తెలియజేయడం తప్పు అని అఖిలేశ్‌ అన్నారు. బీజేపీ అసత్యాలు చెబుతోందని అందరికీ తెలుసు కానీ విదేశీయుల ముందు దేశాన్ని కించపరిచేలా యువజన కాంగ్రెస్‌ నేతలు ప్రవర్తించకుండా ఉండాల్సిందన్నారు. రాజకీయ పోరు కోసం దేశ గౌరవాన్ని పణంగా పెట్టడం సరికాదని బెంగాల్‌ ఐటీ మంత్రి, టీఎంసీ నేత బాబుల్‌ సుప్రియో అన్నారు.

Read Also: దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్లేనా? గడువుకు ముందే ఆపరేషన్‌ కగార్‌ విజయవంతం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు