
సినీ తారలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన ఓ వీడియోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై జాన్వీ కపూర్ స్పందించారు.
AI టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఇలాంటి నకిలీ వీడియోలను తయారు చేయడం, వాటిని ఇతరులకు పంపించడం లేదా సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేయడం చేయొద్దని జాన్వీ కోరారు. సాంకేతికతను సృజనాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సింది పోయి.. వ్యక్తుల ప్రతిష్ఠ, గౌరవానికి భంగం కలిగించేలా దుర్వినియోగం చేయడం తీవ్రంగా కలవరపెడుతోందని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి డీప్‌ఫేక్ లేదా మార్ఫింగ్ కంటెంట్ రూపొందించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. ఇలాంటి వికృత చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నకిలీ కంటెంట్‌ను రూపొందించిన వారితో పాటు దాన్ని ఉద్దేశపూర్వకంగా షేర్ చేసే వారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించారు.
‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో వ్యవహారంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటికే స్పందించారు. మహిళలను అవమానించేలా, వారి గౌరవానికి భంగం కలిగించే విధంగా AI సాంకేతికతను ఉపయోగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
AI టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నకిలీ ఫొటోలు, వీడియోలను రూపొందించడం సులభంగా మారింది. దీంతో సెలబ్రిటీలే కాకుండా సాధారణ వ్యక్తుల ఫొటోలు, వీడియోలు కూడా దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను నిజమని నమ్మకుండా, అనుమానాస్పద కంటెంట్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
also read: నెస్లే డెయిరీ వైటనర్పై FSSAI కీలక ఆదేశాలు.. విక్రయాలు నిలిపివేత