After Ajit Pawar: భార్యా.. కుమారుడా?.. ఎన్సీపీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేదెవరు?

అజిత్‌ పవార్‌ అకాల మరణంతో ఆయన వారసులుగా ఎన్సీపీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేదెవరనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అజిత్‌ పవార్‌ అకాల మరణంతో ఆయన వారసులుగా ఎన్సీపీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేదెవరనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన భార్య సునేత్ర పవార్‌, కుమారులు పార్థ్‌ పవార్‌, జై పవార్‌లలో ఒకరు కచ్చితంగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, అజిత్‌ చిన్నాన్న శరద్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీ-ఎస్పీలో ఎన్సీపీ విలీనం కావచ్చని ఇంకొందరు అంచనా వేస్తున్నారు.

ఎన్సీపీని చీల్చి బీజేపీతో దోస్తీ!

శరద్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చిన అజిత్‌.. నాడు ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. తర్వాత ఎన్నికల కమిషన్‌ అజిత్‌ నేతృత్వంలోని పార్టీనే అసలైన ఎన్సీపీగా గుర్తించింది. శరద్‌ పవార్‌ పార్టీ ఎన్సీపీ-ఎస్పీ అయింది. బీజేపీ, షిండే శివసేనతో కలిసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లలో పోటీచేసిన ఎన్‌సీపీ ఒక్క చోటే గెలిచింది. అజిత్‌ భార్య సునేత్ర బారామతిలో తన ఆడపడుచు, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలేపై పోటీచేసి ఓటమిపాలయ్యారు. కానీ ఆ ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్‌ తన పార్టీని 41 చోట్ల విజయపథంలో నడుపగా.. శరద్‌ పవార్‌ పార్టీ పది సీట్లకే పరిమితమైంది. తర్వాత రెండు గ్రూపుల విలీనం దిశగా ప్రాథమిక చర్చలు నడిచాయి. అజిత్‌ ఆసక్తి చూపకపోవడంతో ముందుకు కదల్లేదు.

శరద్ పవార్ తో కలిసేందుకు సునేత్ర ఒప్పుకుంటుందా?

ఇటీవల పుణె, పింప్రీ-చించ్వాడా కార్పొరేషన్లలో అజిత్‌ తన చిన్నాన్న పార్టీతో కలిసి పోటీచేశారు. ఇలాంటి దశలో అజిత్‌ మరణించారు. ఈ క్రమంలో రెండు వర్గాలు కలిసిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ విలీనానికి సునేత్ర నుంచి అభ్యంతరం రావచ్చని అజిత్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో శరద్‌ పవార్‌ తన కోడలైన సునేత్రను  బయటి వ్యక్తిగా విమర్శించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆమె ఆ కుటుంబానికి చేరువయ్యేందుకు అంగీకరిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అజిత్‌ పెద్ద కుమారుడు పార్థ్‌ కు రాజకీయ అనుభవం ఉన్నా.. ఇటీవల రూ.300 కోట్ల భూకుంభకోణంలో ఆయన పేరు రావడంతో ప్రతిష్ఠ దెబ్బతింది. దానికితోడు తండ్రి అడుగుజాడల్లో పార్టీని నడిపే సత్తా ఆయనకు లేదని అజిత్‌ సన్నిహితులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోందిన వారసత్వ వ్యవహారం కొలిక్కి వచ్చేదాకా తాత్కాలికంగా పార్టీ బాధ్యతలన్నీ సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ తత్కరే నిర్వహించే అవకాశం ఉందని ఎన్సీపీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button