
Kashmiri Pandits Rath Yatra: కాశ్మీర్ లో అరుదైన యాత్ర అందరినీ ఆకట్టుకుంది. శ్రీనగర్ లో కశ్మీర్ పండిట్లు గణేష్ చవితి ఉత్సవాల్లో భాగంగా రథయాత్ర నిర్వహించారు. 35 క్రితం కశ్మీర్ లో తీవ్రవాదం మొదలైనప్పటి నుంచి కశ్మీర్ పండిట్లు రథయాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. శ్రీనగర్‌లోని హబ్బ కదల ఏరియాలోని గణపతియార్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. కశ్మీర్ పండిట్లు భక్తిశ్రద్ధలతో ఎంతో ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జీలం నదిలో గణేశ నిమజ్జనంతో రథయాత్ర పూర్తయింది. కశ్మీర్ లోయలో తీవ్రవాదం తలెత్తినప్పటి నుంచి వినాయక చతుర్ధి ఊరేగింపు నిర్వహించడం ఇదే మొదటిసారని కశ్మీరీ పండిట్లు చెప్పారు.
కుల,మత భేదాలు లేకుండా..
జమ్మూకాశ్మీర్ లో ప్రకృతి వైపరీత్యాలు ఆగిపోయి, కుల, మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని గణనాథుని మేము ప్రార్థించామని కశ్మీర్ పండిట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం కలగరాదని ప్రార్థనలు చేసినట్లు వివరించారు. గణపతి నిమజ్జనాన్ని కశ్మీర్ పండిట్లు గత మూడేళ్లుగా జరుపుకొంటున్నట్టు పండిట్ నేత ఒకరు తెలిపారు. కశ్మీర్ పండిట్లు నిర్వహించిన ఐదు రోజుల గణేష్ చతుర్ధి ఉత్సవాలు ఆదివారంతో ముగిసాయి. దశాబ్దాల తర్వాత కశ్మీర్ పండిట్లు యాత్ర నిర్వహించడం ఆసక్తి కలిగించింది.