
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం పెను విషాదాన్ని సృష్టించింది. మృతుల సంఖ్య 1400 దాటింది. కునార్, నంగర్ హార్ ప్రావిన్స్ లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. భూకంప తీవ్రతకు పలు గ్రామాలు నేలమట్టం అయ్యాయి. సుమారు 5 వేల ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 1400 మంది చనిపోగా, 5000 మందికిపైగా గాయపడినట్లు తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
భూకంప తీవ్రతకు కొండ చరియలు విరిగిపడి..
భూకంపం వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు ధ్వంసం అయ్యాయి. సరైన రోడ్డు మార్గాలు లేకపోవడంతో సహాయచ ర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించుకునేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చేతులతోనే మట్టిని తవ్వితీస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. రాత్రి సమయంలో భూకంపం రావడంతో చాలామంది నిద్రలో ఉండటంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలామంది సజీవ సమాధి అయ్యారు. భూకంప కేంద్రం కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉంది. మరోపక్క తాలిబన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భారత్ సహా పలు దేశాలు మానవతా సాయాన్ని అందిస్తున్నాయి. ఆహారం, మందులు, నివసించేందు టెంట్లు పంపించింది భారత సర్కారు.