New UIDAI Aadhaar App: కేంద్ర ప్రభుత్వం ఆధార్ విషయంలో మరో కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కార్డులకు భిన్నంగా కొత్త ఆధార్ కార్డులు అందుబాటులోకి రాబోతున్నాయి. కార్డుదారుని ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా ఆధార్ కార్డును రూపొందించేలా కేంద్రం ఆలోచనలు చేస్తోంది. ఆధార్ కార్డుదారుడి వ్యక్తిగత సమాచారాన్ని మిస్ యూజ్ చేయకుండా, ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉడాయ్ సీఈఓ భువనేశ్ కుమార్ సూత్రప్రాయ ప్రకటన చేశారు.
18 నెలల్లో అందుబాటులోకి!
వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టానికి అనుగుణంగా త్వరలో ఉడాయ్ కొత్త యాప్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు భువనేష్ కుమార్ తెలిపారు. మరో 18 నెలల్లో ఈ చట్టం అమల్లోకి రానుంది. దానికి అనుగుణంగా కొత్త ఆధార్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా కొత్త ఆధార్ కార్డు గురించి బ్యాంకులు, హోటళ్లు సహా పలు భాగస్వామ్య సంస్థలతో ఉడాయ్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈవో భువనేష్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ‘‘డిసెంబరులో కొత్త నిబంధనను తీసుకురాబోతున్నాం. కార్డు మీద ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండబోతోంది” అని తెలిపారు.
ఈజీగా ఆధార్ మార్పులు
ఇక డిసెంబరు 1నుంచి ఆఫ్ లైన్ వెరిఫికేషన్ పద్ధతులను నిరోధించే దిశగా ఉడాయ్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇకపై ఆధార్ ను ఒక డాక్యుమెంటులా ఉపయోగంచడానికి వీలు కుదరదు. ధ్రువీకరణను క్యూఆర్ కోడ్ లేదంటే, ఆధార్ నంబరుతో చేయాల్సి ఉంటుంది. ఉడాయ్ కొత్త యాప్ తో అడ్రస్, ఫోన్ నంబరు మార్పులు చేర్పులను ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ లోని ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. ఎం ఆధార్ యాప్ స్థానంలో వచ్చే ఈ కొత్త యాప్ వివిధ ప్రాంతాల్లో, అవసరాల్లో అథెంటికేషన్, వయస్సు ధ్రువీకరణ ప్రక్రియను మరింత ఈజీ చేయనున్నట్లు సీఈవో భువనేశ్ వెల్లడించారు.





