ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

లవర్ కోసం మతం మారిన యువకుడు.. చివరికి?

ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు. కొన్నిసార్లు ప్రేమ మనిషిని హద్దులు దాటేలా చేస్తుంది.

ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు. కొన్నిసార్లు ప్రేమ మనిషిని హద్దులు దాటేలా చేస్తుంది. ప్రేమించిన వ్యక్తి కోసం ఏకంగా జీవన విధానాన్నే మార్చేసే ఘటనలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి సంఘటనే తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి కోసం మతం మార్చుకున్న ఓ యువకుడు చివరకు ఆమెను దక్కించుకోలేకపోయాడు. పైగా దేశ వ్యతిరేక వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుని జైలుపాలయ్యాడు.

శ్రీ సత్యసాయి జిల్లా దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అనే యువకుడు, అదే జిల్లాలోని గోర్లవాండ్లపల్లికి చెందిన ఓ ముస్లిం యువతిని ప్రేమించాడు. తమ ప్రేమకు మతం అడ్డంకిగా మారుతుందని భావించిన ధనుంజయ్, అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకుంటారనే నమ్మకంతో ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. మత మార్పుతో పాటు తన పేరును షేక్ మొహమ్మద్ ఆసిఫ్‌గా మార్చుకున్నాడు. ప్రేమ కోసం తన గుర్తింపునే మార్చుకున్న ఈ యువకుడి కథ అక్కడితో ఆగలేదు.

కాలక్రమంలో ప్రేమించిన యువతి అతడిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ధనుంజయ్ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తిరుపతికి చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద కారు అద్దెకు తీసుకున్న అతడు ప్రమాదం చేయడంతో రూ.15 వేల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. అయితే డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటూ ఉండటంతో, ప్రసన్నకుమార్ రెడ్డి బెంగళూరులో ఉన్న ఆసిఫ్‌ను పట్టుకుని నిలదీశాడు.

ఈ సందర్భంగా మహమ్మద్ ఆసిఫ్ పాకిస్తాన్‌కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసిన దేవిరెడ్డిపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్లచెరువు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు నిర్ధారణ కావడంతో ధనుంజయ్ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రేమ కోసం మతం మారడం తప్పుకాదని కొందరు అభిప్రాయపడుతున్నప్పటికీ, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాన్ని పొగడ్తలతో ముంచడం మాత్రం సమాజం తీవ్రంగా ఖండిస్తోంది.

ఈ ఘటన ప్రేమ పేరుతో తీసుకునే నిర్ణయాలు ఎంతటి పరిణామాలకు దారితీయగలవో స్పష్టంగా చూపిస్తోంది. ప్రేమ ఒక వ్యక్తిగత భావమే అయినా.. దేశ భద్రతకు, సామాజిక శాంతికి భంగం కలిగించే చర్యలు సహించబోవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

ALSO READ: కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న స్మార్ట్ ప్రొజెక్టర్లు.. ఇక ఇంట్లోనే థియేటర్ అనుభూతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button