
మలేషియాలోని పెకాన్ తీర ప్రాంతంలో డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం ఓ భారీ లోహపు వస్తువు కనిపించడం కలకలం రేపింది. సముద్రపు అలల దాటికి తీరానికి కొట్టుకొచ్చిన ఈ భారీ శకలాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు.
అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ లోహపు వస్తువు సుమారు 500 కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు. దీని పొడవు సుమారు 4.26 మీటర్లు కాగా, వెడల్పు దాదాపు 3.64 మీటర్ల వరకు ఉందని వెల్లడించారు. ఇంత పెద్ద లోహపు వస్తువు సముద్రం నుంచి రావడంతో ఇది సాధారణ శకలం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై స్పందించిన మలేషియా సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ లోహపు వస్తువు అంతరిక్షం నుంచి భూమిపై పడిన ఉపగ్రహ శకలమా? లేక రాకెట్‌కు చెందిన విడిభాగమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే అసలు విషయం వెల్లడవుతుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఆ లోహపు వస్తువును భద్రతా పరంగా వేరుచేసి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు దాని సమీపానికి వెళ్లకుండా పోలీసు, భద్రతా బలగాలు ఆంక్షలు విధించాయి. ఎలాంటి రేడియేషన్ ప్రమాదాలు లేదా ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష చెత్త భూమిపై పడే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయోగాలు పూర్తైన రాకెట్ల భాగాలు లేదా పనికిరాని ఉపగ్రహాలు భూమి వాతావరణంలోకి ప్రవేశించి ఇలాంటి శకలాలుగా పడే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఘటనపై అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల సహకారంతో కూడిన దర్యాప్తు చేపట్టే అవకాశముందని మలేషియా అధికారులు తెలిపారు. శకలానికి సంబంధించిన లోహ నిర్మాణం, తయారీ విధానం, దాని మూలం వంటి అంశాలను సాంకేతికంగా విశ్లేషించిన తర్వాత పూర్తి నివేదిక విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఈ వింత ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. సముద్రం నుంచి ఇలా భారీ లోహపు వస్తువు రావడం భవిష్యత్తులో భద్రతాపరమైన సవాళ్లను తెస్తుందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక నివేదిక వచ్చే వరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వొద్దని ప్రభుత్వం సూచించింది.
ALSO READ: 6 ఏళ్ల బాలికపై టెర్రస్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై మరో ఘోరం





