ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో విభిన్నమైన కథలతో కూడిన సినిమాలు ప్రేక్షకులను బలంగా ఆకర్షిస్తున్నాయి. సాధారణ కథలకు భిన్నంగా ఉండే కొత్త కాన్సెప్ట్ చిత్రాలకే ఎక్కువ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, తాజాగా విడుదలైన ఒక చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికను కుదిపేస్తోంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ‘మేడ్ ఇన్ కొరియా’ అనే ఈ చిత్రం, స్టార్ హీరోలు లేకపోయినా కథ బలంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు ఊపందుకోవడం విశేషం.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన ప్రియాంక మోహన్ తన నటనతో మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె కెరీర్‌లో ఇదే తొలి మహిళా ప్రాధాన్య చిత్రం కావడం ప్రత్యేకత. గతంలో ఓజీ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆమె.. ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా 2026 మార్చి 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండటంతో విస్తృత స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతోంది.
కథ విషయానికి వస్తే.. షెన్బా అనే యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో పెరిగిన ఆమె చిన్ననాటి నుంచే కొరియా సంస్కృతిపై ప్రత్యేకమైన ఆసక్తి పెంచుకుంటుంది. స్కూల్‌లో జరిగిన ఒక నాటకం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అక్కడి నుంచి కె డ్రామాలు, సంగీతం, కొరియా జీవన విధానం పట్ల ఆమెకు ఆకర్షణ పెరుగుతుంది. ఈ ఆసక్తి ఆమెను కొరియా వెళ్లాలనే లక్ష్యంతో ముందుకు నడిపిస్తుంది. అందుకోసం కొరియన్ భాషను కూడా నేర్చుకుంటుంది.
ఇక కుటుంబం ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో, తన ప్రేమికుడితో కలిసి కొరియా వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అయితే చివరి నిమిషంలో అతడు ఆమెను మోసం చేయడంతో, ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత ఆమె సియోల్ నగరానికి చేరుకుని జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో పార్క్ హే జిన్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి రావడం కథకు కీలక మలుపు ఇస్తుంది. అక్కడ ఆమె ఎలా నిలబడింది, తన కలలను ఎలా సాధించింది అనేది సినిమా ప్రధానాంశం.
ALSO READ: గంజిలో ఉన్న అద్భుతమైన రుచిని తెలుసుకోకుండా పారబోస్తున్నారా..?
