తెలంగాణ

మంత్రులకు తప్పిన పెను ప్రమాదం… ఏకంగా సభా ప్రాంగణంలో దిగిన హెలీకాప్టర్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ :-
నిజామాబాద్ లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ కుమార్ రెడ్డి లు హెలికాప్టర్ లో హాజరవుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి కాస్త దూరంలో హెలీప్యాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. కానీ మంత్రుల హెలికాప్టర్ ను అనూహ్యంగా పైలెట్ సభా ప్రాంగణంలోనే దించేశాడు. ఈ పరిణామంతో హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ భారీగా దుమ్ము ఎగసి పడింది. దీంతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు సైతం నేలకూలాయి. ఈ హఠాత్పరిణామానికి జనం అంతా అక్కడ నుంచి పరుగులు తీశారు. అదే విధంగా మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన 150 స్టాళ్లలో కొన్ని చిందరవందరగా పడిపోయాయి. సభ బందోబస్తు కోసం వచ్చిన పోలీసుల్లో కొంత మందికి స్వల్ప గాయాలైనట్లు గా సమాచారం.

కాగా ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. భూ భారతి చట్టం – 2025 అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నాగర్ కర్నూల్ జిల్లాకు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ లు హెలికాప్టర్ లో వెళ్ళారు. హెలికాప్టర్ ను కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డి పై ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button