
సెంట్రల్ ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రసాద్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జీవనోపాధి కోసం గులాబీలు అమ్ముకుంటున్న 11 ఏళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యం మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. చిన్నారి అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకున్న ఓ ఈ రిక్షా డ్రైవర్, పథకం ప్రకారమే ఆమెను మోసం చేసి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
జనవరి 11వ తేదీన ఈ ఘటన జరిగింది. రోజువారిలాగే ప్రసాద్ నగర్ పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బాలిక పూలు అమ్ముకుంటూ ఉంది. అదే సమయంలో దుర్గేష్ అనే సుమారు 40 ఏళ్ల వయసున్న ఈ రిక్షా డ్రైవర్ అక్కడికి వచ్చాడు. ప్రయాణికులను దింపిన అనంతరం రిక్షాను సిగ్నల్ వద్ద ఆపి, బాలికను గమనించాడు. తన దగ్గరున్న గులాబీలన్నింటినీ కొనేస్తానని నమ్మించి, ఆమెను రిక్షాలో ఎక్కించుకున్నాడు. అమాయకత్వంతో అతడి మాటలను నమ్మిన బాలిక అతనితో వెళ్లిపోయింది.
వార్తా సంస్థ PTI కథనం ప్రకారం.. నిందితుడు బాలికను ప్రొఫెసర్ రామ్ నాథ్ విజ్ మార్గ్ సమీపంలోని ఏకాంత అడవి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని చోట ఆమెపై అత్యాచారం చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలిక స్పృహ కోల్పోయి అక్కడే కుప్పకూలిపోయింది. అధిక రక్తస్రావంతో ఆమె చనిపోయిందని భావించిన నిందితుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.
కొంత సమయం తర్వాత స్పృహకు వచ్చిన బాలిక తీవ్ర వేదనతో అక్కడి నుంచి బయటపడి, ఎలాగోలా తన ఇంటికి చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెకు వైద్య చికిత్సతో పాటు మానసిక కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక తీవ్ర షాక్‌కు గురవడంతో మొదట్లో పూర్తి వివరాలు చెప్పలేకపోయింది. దీంతో పోలీసులకు ఇది పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ, ఘటన జరిగిన ప్రాంతం నుంచి అడవి వరకు ఉండే మార్గాల్లో ఏర్పాటు చేసిన సుమారు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
వివిధ మార్గాల్లోని ఫుటేజీలను విశ్లేషించిన పోలీసులు.. ఒక కీలక దృశ్యంలో బాలిక ఈ రిక్షాలో ఎక్కుతున్నట్లు గుర్తించారు. ఆ ఫుటేజీ ఆధారంగా రిక్షా రిజిస్ట్రేషన్ నంబర్‌ను ట్రేస్ చేశారు. అదే నంబర్ ఆధారంగా నిందితుడు దుర్గేష్‌ను గుర్తించి, ఘటన జరిగిన రోజే అతన్ని అరెస్టు చేయడంలో పోలీసులు విజయం సాధించారు.
విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. కొంతకాలంగా సిగ్నల్ వద్ద గులాబీలు అమ్ముకుంటున్న బాలికను గమనిస్తున్నానని, ఆమెను కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతో ముందుగానే ప్రణాళిక వేసుకున్నానని ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పోలీసులు రక్తపు మరకలున్న దుస్తులు సహా పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చిన్నారిపై జరిగిన ఈ ఘోరానికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన ప్రతి కోణాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ALSO READ: తల్లి చేతులో ఉన్న బిడ్డను లాక్కెళ్లి బావిలో పడేసిన కోతి.. రక్షించిన డైపర్!





