
దేశవ్యాప్తంగా సంతానలేమి సమస్య పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది దంపతులు IVF పద్ధతి వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ చికిత్స ఖర్చులు ఇప్పుడు సాధారణ కుటుంబాలకు మోయలేనంత భారంగా మారుతున్నాయి. తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి ICMR విడుదల చేసిన నివేదిక చాలా కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఐవీఎఫ్ చికిత్స పొందుతున్న జంటల్లో 80 నుంచి 90 శాతం మంది ఏదో ఒక దశలో భారీ అప్పులకు గురవుతున్నారని, ఆర్థికంగా పూర్తిగా కుంగిపోతున్నారని వెల్లడించింది.
సంతానం కోసం సంవత్సరాల పాటు అవస్థలు పడుతున్న జంటలు చివరి ఆశగా IVF చికిత్సను ఎంచుకుంటారు. అయితే ప్రతి ప్రయత్నం కొన్ని లక్షల నుంచి పదిలక్షల వరకు ఖర్చవడం, చికిత్సకు అనేక విడతల్లో భారీ వ్యయం రావడం కారణంగా ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. ప్రత్యేకించి మధ్యతరగతి కుటుంబాలు బ్యాంకు రుణాలు, బంగారం అప్పగింతలు, ప్రైవేట్ రుణాలు తీసుకోవడం వంటి పరిస్థితులకు దిగజారుతున్నాయని ఐసీఎంఆర్ నివేదిక స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఐవీఎఫ్ విధానాన్ని ఆయుష్మాన్ భారత్- ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనలో చేర్చాలని స్పష్టమైన సిఫార్సులు చేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద పేద కుటుంబాలకు అనేక కీలక వైద్య సేవలు ఉచితంగా అందుతున్న విషయం తెలిసిందే. ఐసీఎంఆర్ సూచన అమల్లోకి వస్తే, ఐవీఎఫ్ చికిత్సకు అయ్యే ఖర్చుల పెద్ద భాగాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేసే వీలుంటుంది.
ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్సకు ముందుకు రావడాన్ని వాయిదా వేసే దంపతులకు పెద్ద ఊరట లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దేశంలో జనన రేటు తగ్గుతున్న ఫ్యాక్టర్లను దృష్టిలో ఉంచుకుంటే, ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయం అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే నిలిచింది. ఐసీఎంఆర్ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, వేలాది కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగు వెలగనుంది. ఈ నిర్ణయం ఆరోగ్యరంగానికే కాకుండా సామాజికంగా కూడా కీలక మలుపు కానుందని నిపుణుల అంచనా.
ALSO READ: Missed Call Messages: వాట్సాప్‌లో మరో 2 కొత్త ఫీచర్లు





