
Kathua Cloudburst: జమ్మూకాశ్మీర్ లో గత కొద్ది రోజులుగా వరుస క్లౌడ్ బరస్ట్ లు తీవ్ర విషాదాలకు కారణం అవుతున్నాయి. గత గురువారం కిస్త్ వార్ లోని చషోటిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఏకంగా, 60 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. తాజాగా కథువా జిల్లాలో మేఘ విస్ఫోటం, కొండ చరియలు విరిగి పడడంతో ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్ము, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
భారీ వర్షాల కారణంగా కథువా జిల్లాలోని నదుల్లో నీటి మట్టం బాగా పెరుగుతోంది. ఉజ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడడంతో పాటు ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పనర్సా, టకోలి, నాగ్వెయిన్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి బురద చేరింది.
ఇంతకీ ఏంటీ క్లౌడ్ బరస్ట్?
అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ప్రాంతంలో, అతి ఎక్కువ వర్షపాతం నమోదు కావడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటలకు 10 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డు అవుతుంది. ఉరుములు, పిడుగులతో భారీ స్థాయిలో కురిసే వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు ఏర్పడుతాయి. రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించినపుడు అరేబియా సముద్రంలోనుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి అధిక తేమ కలిగిన మేఘాలుగా మారతాయి. వాతావరణంలో వేడి వల్ల ఈ మేఘాలు కరుగుతూ ఉంటాయి. అలా కరిగి, కరిగి మేఘాలు బరువెక్కుతాయి. ఏదో ఒక చోట పేలిపోతాయి. అలా తక్కువ ప్రాంతంలో, తక్కువ సమయంలో భారీ వర్షం పడి వినాశనం జరుగుతుంది. క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు? ఎక్కడ? ఎప్పడుతుంది అనే కచ్చితంగా చెప్పడం కష్టం.